- ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నగర పేదల సొంతింటి కలకు ప్రభుత్వం శ్రీకారం
తొలి విడతగా 16 నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణం
జూలై 21 నుంచి ఆగస్టు 10 వరకు దరఖాస్తులు
మీసేవ, వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్ ద్వారా అప్లై
రూ. 40-60 లక్షల విలువైన స్థలం పూర్తిగా ఉచితం
ఆడపడుచుల పేరిటే రిజిస్ట్రేషన్
10 ఏళ్ల వరకు అమ్మకంపై నిషేధం
హైదరాబాద్ వెలుతురు జూలై 20:
హైదరాబాద్ మహానగర పరిధిలోని నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అడుగులు వేస్తోంది. ‘క్యూర్’ పరిధిలో లక్ష ఎల్ఐజీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్, క్యూర్ పరిధిలోని 16 నియోజకవర్గాల శాసనసభ్యులు, అధికారుల సమక్షంలో సోమవారం నాడు సచివాలయంలో ఘనంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి విడతగా క్యూర్ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రయోగాత్మకంగా, నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున మొత్తం 8 వేల ఇళ్ల నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రభుత్వం అత్యంత సులభతరం చేసింది. జూలై 21వ తేదీ నుండి ఆగస్టు 10వ తేదీ వరకు అర్హులైన పేదల నుంచి అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రజలు మీసేవ కేంద్రాలు, అధికారిక వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ ద్వారా సులభంగా అప్లై చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక వాట్సాప్ నెంబర్ (8096958096) ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఏ నియోజకవర్గానికి చెందిన ప్రజలు ఆ నియోజకవర్గ పరిధిలోనే దరఖాస్తు చేసుకోవాలని, కుటుంబ వార్షిక ఆదాయం రూ. 6 లక్షల లోపు ఉండాలని కండిషన్ పెట్టారు.
ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు లభించే భూమి విలువ మార్కెట్లో రూ. 40 లక్షల నుండి రూ. 60 లక్షల వరకు ఉంటుందని మంత్రి వివరించారు. ఇంతటి భారీ విలువైన ప్రభుత్వ స్థలాలను లబ్ధిదారులైన ఆడపడుచుల పేరిట ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుందని ప్రకటించారు. అయితే, ఈ ఇళ్లను కమర్షియల్ కాకుండా చూసేందుకు పదేళ్ల వరకు ఎవరికీ అమ్ముకునే అవకాశం ఉండదని, కానీ ఆర్థిక అవసరాల కోసం బ్యాంకుల్లో రుణం (లోన్) పొందేందుకు మాత్రం ఈ పత్రాలను తణఖా పెట్టుకునే వెసులుబాటు కల్పించామన్నారు.
క్యూర్ పరిధిలో నిర్మించే ప్రతి ఇందిరమ్మ ఫ్లాట్ నిర్మాణానికి సుమారు 11 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతోందని మంత్రి తెలిపారు. ఇందులో రూ. 5 లక్షల రూపాయలను ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా సబ్సిడీ రూపంలో భరిస్తుందని చెప్పారు. మిగిలిన 6 లక్షల రూపాయలను లబ్ధిదారుని వాటాగా నిర్ణయించామని, పేదలకు భారం కాకుండా ఈ మొత్తాన్ని నాలుగు సులభ వాయిదాలలో (ఇన్‌స్టాల్‌మెంట్స్) చెల్లించే సౌకర్యం కల్పించామన్నారు. దరఖాస్తు సమయంలో కట్టే రూ. 10 వేలను ఒకవేళ ఇల్లు రాకపోతే తిరిగి ఇచ్చేస్తామని, ఇల్లు వస్తే ఆ 6 లక్షల్లో మినహాయిస్తామని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇళ్ల మంజూరులో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చట్టప్రకారం రిజర్వేషన్లు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. క్యూర్ పరిధిలో సొంత స్థలం గానీ, ఇల్లు గానీ లేని వారిని మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తామన్నారు. దరఖాస్తులను 360 డిగ్రీల పరిధిలో అత్యంత పారదర్శకంగా వడపోత (స్క్రీనింగ్) చేస్తామని, ఒకవేళ కోటా కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే ఎవరికీ అనుమానం లేకుండా అందరి ముందూ బహిరంగంగా లాటరీ తీసి ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా వారు ఇందిరమ్మ ఇళ్ల అధికారిక బ్రోచర్‌ను ఆవిష్కరించారు. క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరును సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఇన్‌స్టాగ్రామ్’ ద్వారా అత్యంత సహేతుకంగా, వినూత్నంగా వివరించిన నల్గొండ జిల్లా నకిరేకల్ గ్రామానికి చెందిన కొండా నాగరాజు అనే యువకుడిని మంత్రులు ప్రత్యేకంగా సత్కరించి, రూ. 1 లక్ష నగదు బహుమతిని అందజేశారు.

గత ప్రభుత్వాల నిర్లక్ష్యపూరిత విధానాల వల్ల హైదరాబాద్ నగరానికి 30 నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఇళ్లను నిర్మించారని, ఫలితంగా ఉపాధి దొరక్క కేవలం 8-9 వేల మంది మాత్రమే అక్కడ నివసిస్తున్నారని మంత్రి విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం పేదల జీవనోపాధికి, పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని, వారు నివసిస్తున్న ప్రాంతాల చెంతనే ఇళ్లను నిర్మిస్తోందన్నారు. ప్రతిపాదిత 525 చదరపు అడుగుల వైశాల్యంలో ఒక బెడ్‌రూమ్, హాల్, కిచెన్‌తో ఈ ఫ్లాట్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. తొలి విడతలో రాజేంద్రనగర్(మైలార్‌దేవ్‌పల్లి), మహేశ్వరం(జల్పల్లి), శేరిలింగంపల్లి(రాయదుర్గం), మల్కాజిగిరి(కౌకూర్), నాంపల్లి(రెడ్‌హిల్స్), ఖైరతాబాద్(హకీంపేట్ దర్గా) వంటి 16 కీలక ప్రాంతాలను ఎంపిక చేశామని, త్వరలోనే మరో 8 నియోజకవర్గాల్లో స్థలాలు గుర్తిస్తామన్నారు.
హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం జరుగుతున్న బోనాల జాతర శుభ సందర్భంగా ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. వచ్చే ఏడాది క్యూర్ పరిధిలో నిర్మించే ఈ కొత్త ఇందిరమ్మ ఇళ్ల నుంచే పేద ఆడపడుచులతో బోనాలు ఎత్తించేలా పనులను శరవేగంగా పూర్తి చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమం నుంచి వెనక్కి తగ్గడం లేదని, ఇళ్ల నిర్మాణ పురోగతిని బట్టి ప్రతి సోమవారం బిల్లుల చెల్లింపులు జరుపుతున్నామని చెప్పారు. కేవలం పేదలే కాకుండా, సొంత ఇల్లు లేని మధ్యతరగతి ప్రజల గురించి కూడా ఆలోచిస్తున్నామని, త్వరలోనే వారికి కూడా గృహనిర్మాణ రంగంలో ఒక అద్భుతమైన శుభవార్త అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.




