త్వ‌ర‌లో ఆర్‌టీసీ విలీనం

మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
కార్మికుల‌ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఒక్కొక్క సమస్యకూ శాశ్వత పరిష్కారం
సంస్థను లాభాల బాట పట్టిస్తామన్న పొన్నం
మూడు ప్రధాన సూత్రాలతో ముందుకు
ఎన్నికల అనంతరం విలీన ప్రక్రియ
కార్మిక సంఘాల పునరుద్ధరణపై కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ వెలుతురు జులై 20 :

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్‌టీసీ)ని బలోపేతం చేసేందుకు, కార్మికుల సమస్యలను రూపుమాపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆర్‌టీసీలో దశాబ్దాలుగా పేరుకుపోయిన ఒక్కొక్క సమస్యను తమ ప్రభుత్వం చొరవ తీసుకుని పరిష్కరిస్తున్నామని చెప్పారు. సంస్థను కేవలం లాభాల కోణంలోనే కాకుండా, ప్రజలకు సేవ చేసే ఒక పవిత్రమైన సాధనంగా చూస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో ఆర్‌టీసీని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లేందుకు యాజమాన్యం నిరంతరం శ్రమిస్తోందని మంత్రి పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని ఆర్‌టీసీ కళాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో నర్సంపేట ఆర్‌టీసీ డిపో డ్రైవర్ దివంగత కోలా శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులకు ‘ఉద్యోగుల చేయూత’ అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా సేకరించిన రూ. 90 లక్షల 85 వేల 500 రూపాయల భారీ ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు.

డ్రైవర్ కోలా శంకర్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న సమయంలో తాను స్వయంగా అర్ధరాత్రి వేళ ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని, వైద్యుల చికిత్సను అడిగి తెలుసుకున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. శంకర్ అకాల మరణం తనను ఎంతగానో కలచివేసిందన్నారు. ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని వెల్లడించారు. అంతేకాకుండా శంకర్ కుమారుడు హేమంత్‍కు ఆర్టీసీ సంస్థలోనే త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ప్రస్తుత ప్రజా ప్రభుత్వం మూడు అత్యంత ప్రధానమైన సూత్రాలను బేస్ చేసుకుని ఆర్‌టీసీలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. మొదటిది సంస్థ పరిరక్షణ, రెండోది ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధునాతన సౌకర్యాలు కల్పించడం, మూడోది కంటికి రెప్పలా కాపాడే కార్మికుల సంక్షేమం చూసుకోవడం అని చెప్పారు. ఈ మూడు అంశాలే ప్రాతిపదికగా తాము రాత్రింబవళ్లు శ్రమిస్తున్నామని, ఆర్‌టీసీ అభివృద్ధిలో కార్మికులు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

గత ప్రభుత్వ హయాంలో ఆర్‌టీసీలోని కార్మిక సంఘాలను పూర్తిగా ఎత్తివేసి, కార్మికుల హక్కులను కాలరాస్తూ నిరంకుశంగా వ్యవహరించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కానీ తమ ప్రభుత్వం రాగానే ప్రజాస్వామ్యబద్ధంగా కార్మికులకు తమ గళాన్ని వినిపించే హక్కును కల్పించిందన్నారు. ఇందులో భాగంగానే త్వరలోనే ఆర్‌టీసీలో అధికారికంగా యూనియన్ ఎన్నికలను నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసిన వెంటనే, ప్రభుత్వంలో ఆర్‌టీసీ విలీన ప్రక్రియను కూడా వేగవంతం చేస్తామని ప్రకటన చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆర్‌టీసీ చరిత్రనే మార్చేసిందని మంత్రి కొనియాడారు. ఈ పథకం వల్ల కోట్లాది మంది మహిళలు ప్రతిరోజూ ఉచితంగా, సురక్షితంగా ప్రయాణాలు సాగిస్తున్నారన్నారు. దీనివల్ల ఆర్‌టీసీపై సామాన్య ప్రజల్లో ఆదరణ, నమ్మకం వంద రెట్లు పెరిగిందన్నారు. మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించిన టికెట్ డబ్బులను ప్రభుత్వం ఏ నెలకు ఆ నెల అత్యంత పారదర్శకంగా ఆర్‌టీసీ సంస్థకు విడుదల చేస్తోందని, ఇందుకోసం నెలకు రూ. 300 కోట్ల నిధులను నేరుగా ఇస్తోందని స్పష్టం చేశారు.

హైదరాబాద్ మహానగరంలో నివసిస్తున్న ప్రయాణికుల సౌకర్యార్థం రవాణా వ్యవస్థలో సరికొత్త మార్పులు తీసుకువస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నగరంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆర్‌టీసీ బస్సు సర్వీసులను నగరంలోని మెట్రో రైలు స్టేషన్లతో, ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లతో పూర్తిగా అనుసంధానం (ఇంటిగ్రేషన్) చేస్తున్నామని చెప్పారు. దీనివల్ల ప్రయాణ సమయం బాగా కలిసి వస్తుందన్నారు. అలాగే నగరంలోని కీలకమైన క్యూర్ ఏరియా పరిధిలో ప్రయాణికుల కోసం అన్ని హంగులతో కూడిన ఒక భారీ సరికొత్త బస్ టెర్మినల్‌ను నిర్మించబోతున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడమే తమ లక్ష్యమని మంత్రి చెప్పారు. అందుకోసం పల్లెల నుండి నేరుగా రాజధాని హైదరాబాద్ నగరానికి కనెక్టివిటీ ఉండేలా ఎన్నో కొత్త రూట్‍లను గుర్తించి, వందలాది కొత్త బస్సులను రోడ్లపైకి తీసుకొచ్చామని వివరించారు. ఆర్టీసీ అనేది కేవలం ఒక సంస్థ కాదు, అది ప్రతి పేదవాడి గుండె చప్పుడు అని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. చివరగా, సంస్థను నమ్ముకుని రిటైర్ అయిన పాత కార్మికుల పెండింగ్ సమస్యలు, పీఎఫ్, గ్రాట్యుటీ వంటి విషయాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, వారి సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్‌టీసీ నాగిరెడ్డి,ఈడి లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.