అమెరికా, వెలుతురు, ఆగష్టు 7:
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం, ఫ్రిస్కో నగరంలోని ప్రిజమ్ బార్ అండ్ గ్రిల్ వేదికగా అజయ్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత, నంది & గద్దర్ అవార్డుల గ్రహీత డా. పొన్నం రవిచంద్ర గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్న “మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్ కుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డా. పొన్నం రవిచంద్ర గౌడ్ నిర్మించిన “ఫూలే” చిత్రానికి సంబంధించిన ట్రైలర్, పాటలను సభలో ఆవిష్కరించి ప్రచారం చేశారు. ఈ చిత్రం ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని తెలిపారు. దేశంలో మనుషులంతా సమానత్వంతో జీవించాలని ఆకాంక్షించి వర్ణ, లింగ వివక్షకు వ్యతిరేకంగా దళిత, గిరిజన, బహుజన వర్గాల అభ్యున్నతి, మహిళల హక్కుల కోసం జ్యోతిబా ఫూలే చేసిన పోరాటం ఆధారంగా ఈ సినిమా రాబోతున్నట్లు రవిచంద్ర తెలిపారు.
అనంతరం ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్ కుమార్ శాతవాహన విశ్వవిద్యాలయంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, విద్యా ప్రమాణాల పెంపు, పరిశోధనలకు ఇస్తున్న ప్రాధాన్యత, అంతర్జాతీయ భాగస్వామ్య కార్యక్రమాలు, మౌలిక వసతుల విస్తరణ తదితర అంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా అమెరికాలోని ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు), పూర్వ విద్యార్థులు, శాతవాహన విశ్వవిద్యాలయ శ్రేయోభిలాషులు తమ జ్ఞానం, అనుభవం, వనరులు, సహకారంతో విశ్వవిద్యాలయ అభివృద్ధికి తోడ్పడాలని ఉపకులపతి విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య, పరిశోధన, ఆవిష్కరణ అవకాశాలు కల్పించడంలో ఎన్‌ఆర్‌ఐల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు.
డల్లాస్ పరిసర ప్రాంతాల్లోని తెలుగు ప్రముఖులు, శ్రేయోభిలాషులు, వివిధ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పరస్పర ఆలోచనల మార్పిడి, సాహిత్యం, సినిమా, విద్యాభివృద్ధి అంశాలపై చర్చలతో కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమంలో(South west zone) అధ్యక్షులు గురుదేవ్, ఉపాధ్యక్షులు జస్వీందర్ రంధావా, చైర్మన్ నీరజ్ గుప్తా, ఆదిత్య (Brista House), సునీల్, భాగ్యనగరం వేణు, మన్నెం ప్రసాద్, కాళోజీ టీవీ అధినేత కిరణ్ దాసరి, శ్రీధర్ వేముల, మురళి రామగోని, రమణ, భగీరథ్ తదితరులు పాల్గొన్నారు.

