మునుగోడుకు నిధుల కేటాయింపులో వివక్ష ఎందుకు : ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి.
మునుగోడు, నవంబర్ 7 (వెలుతురు ):రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అభివృద్ధి విషయంలో మునుగోడు నియోజకవర్గానికి అన్యాయం చేయవద్దని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. కొడంగల్‌లో రూ.9 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్న ప్రభుత్వం మునుగోడుకు ఎందుకు నిధులు కేటాయించడం లేదని ప్రశ్నించారు. కొడంగల్ అభివృద్ధిని తాను వ్యతిరేకించడం లేదని, మునుగోడు ప్రజలకు కూడా అభివృద్ధి ఫలాలు అందాలని ఆకాంక్షిస్తున్నానని స్పష్టం చేశారు.శనివారం
మునుగోడులోని పిఆర్ఆర్ గార్డెన్స్‌లో పి ఆర్ టి యు టీఎస్ రాష్ట్ర సంఘం మాజీ అధ్యక్షుడు, మునుగోడు ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయుడు సుంకరి బిక్షం గౌడ్ ఉద్యోగ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి, డిసిసిబి మాజీ చైర్మన్, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, సుంకరి మల్లేష్ గౌడ్ లతో కలిసి సుంకరి బిక్షం గౌడ్‌ను ఘనంగా సన్మానించి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కృషి, పట్టుదల,దీక్షకు బిక్షం గౌడ్ నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. ఉపాధ్యాయుడిగా అంకితభావంతో పనిచేస్తూ ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేశారని అన్నారు. ఇలాంటి నిబద్ధత కలిగిన వ్యక్తులకు ఉద్యోగ విరమణ ఉన్నా సమాజ సేవకు విరామం ఉండదని పేర్కొన్నారు.సమాజంలో అవినీతి పెరిగిపోతోందని, నాయకులు నీతినిజాయితీతో వ్యవహరించినప్పుడే పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ పేదలు,బడుగు బలహీన వర్గాల పార్టీ అని,బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతోనే బీసీ బిడ్డ అయిన సుంకరి బిక్షం గౌడ్‌కు పి ఆర్ టి యు అభ్యర్థిగా అవకాశం కల్పించాలని తాను ప్రయత్నించినట్లు వెల్లడించారు.ప్రపంచంలోనే ఫ్లోరైడ్ సమస్యతో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో మునుగోడు ఒకటని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నానని తెలిపారు.ఇప్పటికే ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను పలుమార్లు కలిసి నిధుల కేటాయింపుపై విజ్ఞప్తి చేశానని చెప్పారు.ఇప్పటికైనా ప్రభుత్వం వెనుకబడిన నియోజకవర్గాల సమస్యలను గుర్తించి, మునుగోడుకు తగిన నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు రాష్ట్ర,జిల్లా నాయకులు,వివిధ గ్రామాల సర్పంచులు, బిసి సంఘాల నాయకులు, పి ఆర్ టి యు మండల అధ్యక్షుడు యూసుఫ్ పాష,ప్రధాన కార్యదర్శి గొడ్డేటి నరసింహ తదితరులు పాల్గొన్నారు.
