జీఓ 97, శక్తి స్కీమ్‌ను రద్దు చేసి పాత పద్ధతిలో పాలిటెక్నిక్ విద్య కొనసాగించాలి
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి
కాంగ్రెస్ హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి: మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్
న్యూఢిల్లీ, వెలుతురు, ఆగస్టు 31:
తెలంగాణ రాష్ట్రంలో జీఓ 97, శక్తి స్కీమ్‌ను రద్దు చేసి, గతంలో అమలులో ఉన్న విధానంలోనే పాలిటెక్నిక్ విద్యను కొనసాగించాలని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన కోరారు.
న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు జీఓ 97, శక్తి స్కీమ్‌కు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలకు తమ మద్దతు ప్రకటించారు. సుమారు 80 వేల మంది విద్యార్థులు, 10 వేల మంది ఉపాధ్యాయులు, దాదాపు లక్ష కుటుంబాలు ఈ విధానాల రద్దు కోసం ఆందోళన చేస్తున్నారని తెలిపారు.
పాలిటెక్నిక్ విద్య ద్వారా విద్యార్థులు ఇంజినీరింగ్‌తో పాటు ఉన్నత విద్య వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయని, అయితే ప్రస్తుత విధానం వల్ల వారి భవిష్యత్ అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. విద్యార్థులకు ఉన్నత విద్య, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పాలిటెక్నిక్ విద్యా విధానాన్ని కొనసాగించాలని సూచించారు.
ఐటీఐలను పరిశ్రమలతో అనుసంధానం చేసి విద్యార్థులకు ఆధునిక నైపుణ్యాలను అందించాలని ఆయన అన్నారు. శిక్షణ, అప్రెంటిస్‌షిప్ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఐటీఐలను బలోపేతం చేయాలని కోరారు.
పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ వంటి ప్రవేశ పరీక్షల ద్వారా బీటెక్ రెండో సంవత్సరంలో చేరి, బీటెక్, ఎంటెక్ తదితర ఉన్నత విద్యను అభ్యసించి ఇంజినీర్లుగా ఎదిగే అవకాశాలను ప్రభుత్వం పరిరక్షించాలని అన్నారు.
రాష్ట్రంలో ఉన్న 59 పాలిటెక్నిక్ కళాశాలల్లో మౌలిక వసతులు, ప్రయోగశాలలు, విశాలమైన ప్రాంగణాలు అందుబాటులో ఉన్నాయని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఒక్కో కళాశాలకు సుమారు 20 నుంచి 30 ఎకరాల వరకు భూమి ఉందని, వేల కోట్ల రూపాయల విలువైన ఈ భూములను ఇతర అవసరాలకు వినియోగించేందుకు ప్రభుత్వం ప్రయత్నించకూడదని అన్నారు. విద్యా సంస్థల భూములను విద్యార్థుల భవిష్యత్ అవసరాలకే వినియోగించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సుమారు రూ.14 వేల కోట్ల మేర ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. బకాయిలను వెంటనే విడుదల చేసి, పాత విధానంలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
అలాగే నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించి, విద్యార్థులు, నిరుద్యోగులు, యువతతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు రాకేష్ దత్త, జయంత్ యాదవ్, రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
