ఆస్తి హక్కును ‘రేట్ ఆఫ్ ప్రాపర్టీ’గా మార్చేశారు: మహేశ్వర్ రెడ్డి
22A భూములపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి
కాళేశ్వరం, ధరణి తదితర అంశాలపై సీబీఐ విచారణకు లేఖ రాయాలి
హైదరాబాద్, వెలుతురు, సెప్టెంబర్ 5:
22A నిషేధిత భూములు, ‘భూ భారతి’ అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి శుక్రవారం ఇందిరాపార్క్ వద్ద మహా దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలనలో రెవెన్యూ శాఖ ఒక వ్యాపార సంస్థగా మారిందని ఆరోపించారు.
22A పేరుతో భూదందా: మహేశ్వర్ రెడ్డి
రాష్ట్రంలో భారీగా భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ప్రైవేట్ భూములతో పాటు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోని లేఅవుట్లను సైతం 22Aలో చేర్చుతున్నారని విమర్శించారు. కొన్ని భూములను రాత్రికి రాత్రే జాబితా నుంచి తొలగిస్తున్నారంటూ ఆరోపించిన ఆయన, భూములను 22A నుంచి బయటకు తీసేందుకు ‘50-50’ పేరుతో డిమాండ్లు చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారని పేర్కొన్నారు.
మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వేలాది ఎకరాల భూములను 22A జాబితాలో చేర్చారని ఆయన ఆరోపించారు. దీనికి బాధ్యత ఎవరిదో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ‘రేవంత్ రెడ్డి ట్యాక్సా.. రేవంత్-రాహుల్ ట్యాక్సా?’ అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
‘రైట్ టు ప్రాపర్టీ’ కాస్తా ‘రేట్ ఆఫ్ ప్రాపర్టీ’
రాజ్యాంగంలోని ఆర్టికల్ 300A కల్పించిన ఆస్తి హక్కు కాంగ్రెస్ పాలనలో ‘రైట్ టు ప్రాపర్టీ’ నుంచి ‘రేట్ ఆఫ్ ప్రాపర్టీ’గా మారిపోయిందని మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. రెవెన్యూ శాఖలో జరుగుతున్న భూ లావాదేవీలు, భూముల జాబితాలో మార్పులపై సమగ్ర దర్యాప్తు అవసరమని అన్నారు.
రెవెన్యూ మంత్రిపై ఆరోపణలు
కుటుంబ సంస్థల పేర్లపై వేల కోట్ల రూపాయల విలువైన భూముల బదలాయింపులకు సంబంధించిన ఆధారాలతో తాను అసెంబ్లీ మీడియా పాయింట్‌కు వచ్చినప్పటికీ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించలేదని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంలో క్విడ్ ప్రో కో, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంశాలపై మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలని కోరారు.
బీఆర్ఎస్ స్కామ్‌లపై జగన్నాటకం
ధరణి, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, విద్యుత్ కొనుగోళ్లు, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాలపై విచారణ జరిపించి బాధ్యుల నుంచి డబ్బులు రాబడతామని గతంలో చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్‌తో కలిసి జగన్నాటకం ఆడుతున్నారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాన్ని కేవలం మూడు బ్యారేజీలు, రూ.7 వేల కోట్లకు పరిమితం చేసి, భారీ అవినీతి ఆరోపణలను విచారణ పరిధి నుంచి తప్పించారని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వంపై ద్వంద్వ వైఖరి ఆరోపణ
తమ మహా దీక్షకు రెండు రోజుల పాటు అనుమతి కోరినా ప్రభుత్వం నిరాకరించిందని, చివరకు కోర్టును ఆశ్రయించి అనుమతి పొందాల్సి వచ్చిందని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. లా అండ్ ఆర్డర్ కారణంగా తమకు ఒక్కరోజు మాత్రమే అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, అనంతరం కాంగ్రెస్ నేతలకు ధర్నా చౌక్‌లో టెంట్లు వేసుకునేందుకు అనుమతించిందని విమర్శించారు.
రాష్ట్రంలో ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించలేని పరిస్థితులు ఉన్నాయని ఆరోపిస్తూ, ప్రభుత్వం ‘1000 రోజుల సంబరాలు’ నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు.
మూడు ప్రధాన డిమాండ్లు
22A భూముల వ్యవహారంపై బీజేపీ శాసనసభాపక్ష నేత మూడు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు.
* 22A జాబితాలో చేర్చిన భూములపై తక్షణమే ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి.
* అధికారుల లాగిన్ల ద్వారా భూముల వివరాల్లో జరిగిన మార్పులపై సమగ్ర వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలి.
* కాళేశ్వరం, ధరణి తదితర కుంభకోణాలపై సమగ్ర విచారణ కోసం తక్షణమే సీబీఐకి లేఖ రాయాలి.
మహా దీక్ష అనంతరం 22A సమస్యతో నష్టపోయిన ఓ బాధిత రైతు చేతుల మీదుగా నిమ్మరసం స్వీకరించి మహేశ్వర్ రెడ్డి దీక్షను విరమించారు. 22A భూముల సమస్యతో బాధపడుతున్న రైతులు, భూ యజమానులకు బీజేపీ అండగా ఉంటుందని, భూమాఫియాకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
