రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి పాలన చేతకావడం లేదు: కల్వకుంట్ల కవిత

  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో పసిపిల్లల మరణాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి
  • వైద్యం, విద్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం.. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పోటీ
  • అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల కంటే రూపాయి ఎక్కువ ఉన్నా తిరిగి ఇస్తా

హైదరాబాద్, వెలుతురు, సెప్టెంబర్ 26:

రాష్ట్రంలో వైద్య, విద్యా రంగాల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పసిపిల్లల మరణాలపై ప్రభుత్వం సమగ్ర సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పరిపాలనను సమర్థంగా నిర్వహించలేకపోతే బాధ్యతల నుంచి తప్పుకోవాలని అన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2020-21లో 6 వేల మంది, 2022-23లో 4,933 మంది, 2024-25లో 3,853 మంది పసిపిల్లలు మరణించినట్లు ఆమె పేర్కొన్నారు. ఆదిలాబాద్ రిమ్స్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో రాష్ట్రంలోని వైద్య వ్యవస్థపై తనకు అందిన సమాచారం ఆందోళన కలిగించిందన్నారు. హైదరాబాద్‌లోనూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చిన్నారుల మరణాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.

వైద్య రంగానికి బడ్జెట్‌లో 10 శాతం కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ స్థాయిలో నిధులు కేటాయించడం లేదని కవిత విమర్శించారు. గతేడాది వైద్య రంగానికి ₹13,192 కోట్లు కేటాయించగా, ₹9,242 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 11 ఆరోగ్య పథకాల్లో ఏడు పథకాలకు నిధులు కేటాయించలేదని ఆరోపించారు. ఆరోగ్యశ్రీకి కేటాయించిన ₹700 కోట్లలో ₹140 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, పెండింగ్ బకాయిలను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితిపై ఆందోళన

ఆదిలాబాద్ రిమ్స్‌తో పాటు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కవిత కోరారు. జిల్లా కలెక్టర్లు తరచూ ప్రభుత్వ ఆసుపత్రులు, సంక్షేమ హాస్టళ్లను సందర్శించి పరిస్థితులను సమీక్షించాలని సూచించారు. నీలోఫర్ ఆసుపత్రిలో బెడ్ ఆక్యుపెన్సీ అధికంగా ఉండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని, నిమ్స్‌లోనూ బెడ్లు, శస్త్రచికిత్సల కోసం నిరీక్షణ సమస్యలు ఉన్నాయని అన్నారు.

ఆదివాసీ ప్రాంతాల్లో రహదారులు, వైద్య సదుపాయాల మెరుగుదలకు ఐటీడీఏ నిధులను వినియోగించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు అవసరమైన పారిశుధ్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

విద్య, వైద్యంపై ఉద్యమం

విద్య, వైద్య రంగాల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని కవిత అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వాస్తవ పరిస్థితులను ప్రజలు వెలుగులోకి తీసుకురావాలని, కార్యకర్తలు ప్రభుత్వ పాఠశాలల్లోని పారిశుధ్య సదుపాయాలపై నివేదికలు రూపొందించాలని సూచించారు. పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు ప్రభుత్వ స్థలాలు పొందిన కార్పొరేట్ ఆసుపత్రులు ఒప్పందాల ప్రకారం సేవలు అందిస్తున్నాయా లేదా ప్రభుత్వం పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు.

ఆస్తులపై ఆరోపణలు నిరూపిస్తే తిరిగి ఇస్తా

తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల కంటే ఒక్క రూపాయి ఎక్కువగా తన వద్ద ఉన్నట్లు నిరూపించినా ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తానని కవిత అన్నారు. తన ఫామ్‌హౌస్ చట్టబద్ధంగానే నిర్మించుకున్నదని, కబ్జా భూమి, ఎఫ్‌టీఎల్ లేదా అసైన్డ్ భూమి లేదని పేర్కొన్నారు. తన ఆస్తులన్నీ చట్టబద్ధమైనవేనని స్పష్టం చేశారు.

కేసీఆర్, కేటీఆర్ ఫామ్‌హౌస్‌లకు సంబంధించి ఏర్పాటు చేసిన సిట్‌పై ఆమె విమర్శలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాలపై ఏర్పాటు చేసిన దర్యాప్తు సంస్థల ద్వారా ఇప్పటివరకు ఏం సాధించారని ప్రశ్నించారు.

ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పోటీ

ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పోటీ చేస్తుందని కవిత ప్రకటించారు. ప్రజలు తమ నిర్ణయాన్ని స్వేచ్ఛగా తీసుకోవాలని కోరారు. ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియలో చిన్నపాటి క్లరికల్ తప్పిదాల కారణంగా ఓట్లు తొలగించకుండా ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించనున్న సభలో నెరేళ్ల బాధితుల సమస్యలపై కూడా మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో సంబంధిత నివేదికలు, చర్యలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.

చాకలి ఐలమ్మకు నివాళులు

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఆమె చిత్రపటానికి కవిత పూలమాల వేసి నివాళులర్పించారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బహుజన తెలంగాణ కోసం ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్. రూప్‌సింగ్, నవీన్ ఆచారి, మాధవి, శ్రీకాంత్ రావు, అర్చనా సేనాపతి, రాంకోటి, రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.