ప్రతి గ్రామ పంచాయతీకి సొంత భవనం: మంత్రి సీతక్క

  • రూ.1,000 కోట్లతో 5,118 భవనాల నిర్మాణం
  • 3,269 భవనాల పనులు 70 శాతం పూర్తి
  • ఈ ఏడాదిలో అన్ని భవనాల నిర్మాణం పూర్తి చేసే లక్ష్యం
  • 8,000 గ్రామాల్లో మహిళా సంఘాల భవనాలు – రూ.800 కోట్లు
  • హ్యామ్ రహదారుల పనులు గడువులోగా పూర్తి చేయాలి

రంగారెడ్డి, వెలుతురు, సెప్టెంబర్ 26:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి సొంత భవనం ఉండేలా స్యాచురేషన్‌ మోడ్‌లో నిర్మాణాలు చేపడుతున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క తెలిపారు. రాష్ట్రంలో సొంత భవనాలు లేని 5,118 గ్రామ పంచాయతీలకు భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం రూ.1,000 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే 3,269 భవనాల నిర్మాణ పనులు 70 శాతం మేర పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా ఈ ఏడాదిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో శనివారం ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల ప్రాంతీయ సమీక్షా సమావేశాన్ని మంత్రి సీతక్క నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ఆమె సమీక్షించారు.

8,000 గ్రామాల్లో మహిళా సంఘాల భవనాలు

గ్రామ పంచాయతీ భవనాలతో పాటు రాష్ట్రంలోని 8,000 గ్రామాల్లో మహిళా సంఘాల భవనాలను నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం రూ.800 కోట్ల నిధులు మంజూరు చేశామని, ఇప్పటికే అనేక చోట్ల పనులు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. మహిళా సంఘాలకు సొంత భవనాలు అందుబాటులోకి వస్తే వారి కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

హ్యామ్ విధానంలో 3,861 కి.మీ. గ్రామీణ రహదారులు

హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) విధానంలో తెలంగాణలో గ్రామీణ రహదారుల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి సీతక్క తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని గ్రామీణ రహదారుల నిర్మాణానికి వినియోగిస్తున్నట్లు చెప్పారు.

హ్యామ్ ప్రాజెక్టు కింద ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో 3,861 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మిస్తున్నామని, ఇందుకోసం సుమారు రూ.3,382 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో చేపడుతున్న హ్యామ్ రహదారుల్లో సుమారు సగం ఈ నాలుగు జిల్లాల్లోనే ఉన్నందున అధికారులు, కాంట్రాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అక్టోబర్ నుంచి జూన్ వరకు రహదారి నిర్మాణాలకు అనువైన కాలాన్ని పూర్తిగా వినియోగించుకుని పనులను వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో జాప్యం, నాణ్యత లోపాలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

తెలంగాణలో హ్యామ్ విధానంలో చేపడుతున్న గ్రామీణ రహదారుల నిర్మాణాన్ని ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలిస్తున్నాయని, ఇప్పటికే కొన్ని రాష్ట్రాల ప్రతినిధులు తెలంగాణకు వచ్చి ఈ విధానంపై వివరాలు తెలుసుకున్నారని మంత్రి తెలిపారు. కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సమయానికి పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ఆవాసం నుంచి రాష్ట్ర రాజధానికి మెరుగైన రవాణా సదుపాయం కల్పించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా గ్రామీణ రహదారులను బలోపేతం చేస్తున్నామని చెప్పారు.

తాగునీటి సరఫరాపై ముందస్తు ప్రణాళిక

రానున్న వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ నాలుగు జిల్లాల్లోని 19 రిజర్వాయర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామని, సింగూరు మినహా మిగిలిన రిజర్వాయర్లలో తగినంత నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు.

సింగూరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేనందున ప్రత్యేక అధికారిని నియమించి తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. సింగూరుకు నిజాంసాగర్ నుంచి నీటిని తరలించే చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.

సింగూరులో ప్రస్తుతం సుమారు 54 రోజులకు సరిపడా తాగునీటి నిల్వలు ఉన్నాయని, స్థానిక నీటి వనరులను వినియోగించుకోవడం ద్వారా సుమారు 75 రోజుల వరకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు.

ప్రతి మండలానికి డ్రింకింగ్ వాటర్ మేనేజ్‌మెంట్ కమిటీ

వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రతి మండలానికి ముగ్గురు సభ్యులతో డ్రింకింగ్ వాటర్ మేనేజ్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ కమిటీలు ఇప్పటి నుంచే మండలాల్లో పర్యటించి నీటి లభ్యతను అంచనా వేయడంతో పాటు ప్రత్యామ్నాయ నీటి వనరులను గుర్తించాలని సూచించారు.

ఆదివాసీ, గిరిజన ప్రాంతాలు, చెంచు పెంటల్లో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

ఉపాధి హామీ పనులకు ప్రాధాన్యం

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ పనులు తగ్గే అవకాశం ఉన్నందున అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి హామీ పనులు కల్పించాలని మంత్రి సూచించారు. ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాలకు శాశ్వత ఆస్తులు సమకూరేలా పనులను ఎంపిక చేయాలని చెప్పారు.

ఉపాధి హామీ పనుల కోసం రూ.6 వేల కోట్ల బడ్జెట్ అందుబాటులో ఉందని, దాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా గ్రామాల్లో మౌలిక వసతులు, నీటి సంరక్షణ పనులను చేపట్టాలని ఆదేశించారు. జలసిరి కార్యక్రమం కింద చేపట్టిన నీటి సంరక్షణ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

నిర్లక్ష్యంపై చర్యలు

అభివృద్ధి పనుల్లో అధికారులు, కాంట్రాక్టర్లు చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు నాణ్యతలో ఎలాంటి రాజీ పడవద్దని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పనితీరు కనబరిచే అధికారులను ప్రోత్సహిస్తామని, నిర్లక్ష్యం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

గ్రామ పంచాయతీ భవనాలు, మహిళా సంఘాల భవనాలు, గ్రామీణ రహదారులు, తాగునీరు, ఉపాధి హామీ, నీటి సంరక్షణ పనులను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లి ప్రతి గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క తెలిపారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ దాన కిషోర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మి, అదనపు కమిషనర్ రవీందర్‌తో పాటు అదనపు కలెక్టర్లు, సీఈవోలు, డీఆర్డీవోలు, డీపీఓలు, ఇంజినీరింగ్ అధికారులు, ఎస్‌ఈలు, ఈఈలు, ప్రాజెక్ట్ మానిటరింగ్ అధికారులు, జాయింట్ కమిషనర్లు, హ్యామ్ రహదారుల కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.