ఓబీసీ జనగణన కాలమ్ పెట్టకపోతే బీజేపీని ఓడిస్తాం: వీ. హనుమంతరావు
హైదరాబాద్: జనగణనలో ఓబీసీల కోసం ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని, ఓబీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వీ. హనుమంతరావు డిమాండ్ చేశారు. గాంధీ భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. ఓబీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్న బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కులగణన, ఓబీసీ రిజర్వేషన్ల కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల సంఘాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ఓబీసీల హక్కుల సాధన కోసం దేశవ్యాప్తంగా పర్యటించి ప్రజలను చైతన్యవంతం చేస్తామని తెలిపారు. జనగణనలో ఓబీసీ కాలమ్ ఏర్పాటు చేయకపోతే బీజేపీని ఓడించేందుకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్, లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
