సింగరేణిని కాపాడుతున్నాం.. ప్రైవేటీకరణకు తావులేదు: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 15 : సింగరేణిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నాయకులు చేస్తున్న ఆరోపణలను మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. గత పాలకులు బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణి పాల్గొనకుండా చేసి, కొత్త గనులు దక్కకుండా చేశారని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం నైనీ గనికి అనుమతులు సాధించడంతో పాటు తాడిచెర్ల బ్లాక్-2, మణుగూరు పీకే ఓసీ-2 డిప్సైడ్ బ్లాకులను సింగరేణికి అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా, తూకం, పంపిణీలో పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉందని, ఆధారాలు లేకుండా బొగ్గు అక్రమాలపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాంట్రాక్టుల్లో సైట్ విజిట్ నిబంధన సింగరేణి ప్రయోజనాల కోసమేనని, పారదర్శకతతో పాటు పనుల సమర్థవంతమైన నిర్వహణకు ఇది దోహదపడుతుందని వివరించారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిని పెంచడంతో పాటు కీలక ఖనిజాలు, థర్మల్, సౌర విద్యుత్ రంగాల్లోనూ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
