రాష్ట్ర, జిల్లా రహదారి భద్రతా నిధుల నిర్వహణపై సమగ్ర మార్గదర్శకాలు జారీ
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 17 : తెలంగాణ రాష్ట్రంలో రహదారి భద్రతను పటిష్టం చేయడం, ప్రమాదాలను అరికట్టడం మరియు ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు స్పష్టం చేశారు.
భారత ప్రభుత్వ రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా, రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలలో రహదారి భద్రతా నిధుల సమర్థ నిర్వహణ మరియు పర్యవేక్షణ కొరకు తెలంగాణ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను విడుదల చేస్తూ ఉత్తర్వులు (G.O. Ms. No. 48) జారీ చేసిందని ఆయన తెలిపారు.
రహదారి భద్రతా నిధి నిర్వహణ
తెలంగాణ మోటారు వాహనాల పన్నుల (సవరణ) చట్టం, 2026 ప్రకారం వసూలైన రహదారి భద్రతా సెస్ మొత్తాన్ని తెలంగాణ రహదారి భద్రతా (నాన్-లాప్సబుల్) నిధికి కేటాయించడం జరిగింది. మోటారు వాహనాల చట్టం ప్రకారం ఏర్పాటైన చట్టబద్ధమైన ‘రాష్ట్ర రహదారి భద్రతా మండలి’ (ఛైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రి, వైస్-ఛైర్మన్గా గౌరవ రవాణా మంత్రి) ఈ నిధి నిర్వహణ మరియు పరిపాలనను చేపడుతుంది.
పారదర్శకత – ఆన్లైన్ అకౌంటింగ్ మరియు కాగ్ (CAG) ఆడిట్:నిధుల వినియోగంలో పారదర్శకత కోసం తెలంగాణ ఆన్లైన్ అకౌంటింగ్ విధానాన్ని అన్ని జిల్లాలకు విస్తరించాలని నిర్ణయించారు. దీని ద్వారా రాబడులు, ఖర్చులను ఎప్పటికప్పుడు సమీక్షించే వీలు కలుగుతుంది.
రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలలోని ఈ నిధుల ఖాతాలన్నింటినీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) ద్వారా తప్పనిసరిగా ఆడిట్ చేయిస్తారు. సుప్రీంకోర్టు రహదారి భద్రతా కమిటీకి అందుబాటులో ఉండేలా వివరాలను కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు.
జిల్లా స్థాయి కమిటీల క్రియాశీలత – కలెక్టర్లకు ఆదేశాలు
రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు జిల్లా రహదారి భద్రతా కమిటీలను వెంటనే క్రియాశీలం చేయాలని ఆదేశించడం జరిగింది.
ప్రతి నెలా జిల్లా కమిటీల సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించాలి.
ప్రత్యేకంగా జిల్లా రహదారి భద్రతా సమన్వయకర్తలను (Coordinators) నియమించడంతో పాటు జిల్లా భద్రతా ప్రణాళికలను సమర్పించాలి.
పోలీస్, ఆరోగ్యం, ఆర్ & బి, విద్యా శాఖలు మరియు జీహెచ్ఎంసీ (GHMC) లు తమ శాఖల తరఫున నోడల్ అధికారులను నియమించాలి.
వివిధ శాఖల సమన్వయం త్రైమాసిక నివేదికలు:
రోడ్డు భద్రతపై తీసుకున్న చర్యలకు సంబంధించి TG-TMARS, ఆర్ & బి, ప్రజారోగ్య శాఖ, పంచాయతీరాజ్, NHAI, 108 (EMRI), పాఠశాల/కళాశాల విద్యా శాఖలు, ఎక్సైజ్, మున్సిపల్ శాఖలు ‘లీడ్ ఏజెన్సీ ఫర్ రోడ్ సేఫ్టీ’కి ప్రతి త్రైమాసికంలో యాక్షన్ టేకెన్ రిపోర్టులను సమర్పించాల్సి ఉంటుంది.
పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ (రహదారి భద్రత) కార్యాలయాన్ని రాష్ట్ర రహదారి భద్రతా మండలి పరిధిలోకి తీసుకువచ్చి శాఖల మధ్య పూర్తి సమన్వయం సాధిస్తున్నామని మంత్రి తెలిపారు.
ఈ సమగ్ర విధానం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించి, రహదారులను ప్రయాణికులకు సురక్షితంగా మార్చడమే ప్రజా ప్రభుత్వ సంకల్పమని మంత్రి పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు.
