హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద బతుకమ్మ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పొన్నం
సిద్దిపేట, వెలుతురు, అక్టోబర్ 17 : హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. శనివారం హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద బతుకమ్మ పండుగ ఏర్పాట్లను, చెరువు సుందరీకరణ పనులను, చెరువు కట్టపై నూతనంగా నిర్మిస్తున్న మైసమ్మ ఆలయ పనులను ఆయన పరిశీలించారు.
బతుకమ్మ ఘాట్ మెట్ల వద్ద మాత్రమే కాకుండా, చెరువు వైపు ఇతర ప్రాంతాల్లో కూడా అవసరమైన చోట్ల బారికేడ్లు, లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. మహిళలు, కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పండుగను ప్రశాంతంగా, సంతోషంగా జరుపుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఆరేపల్లి చెరువు వద్ద కూడా బతుకమ్మ వేడుకల కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, ఆర్డీవో రామ్మూర్తి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
హుస్నాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం
అనంతరం మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గ్లాస్ బ్రిడ్జి, కప్పగుట్ట పర్యాటక అభివృద్ధి, అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటు వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎల్లమ్మ చెరువుతో పాటు కొత్త చెరువు, పల్లె చెరువులను కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
హుస్నాబాద్‌ను క్రీడారంగంలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కబడ్డీ అకాడమీని మంజూరు చేశామని, స్విమ్మింగ్ పూల్‌కు సంబంధించిన జీవో కూడా రానుందని తెలిపారు. హుస్నాబాద్‌లో స్టేడియం ఏర్పాటు చేయాల్సి ఉందని, నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.
మల్లెచెట్టు చౌరస్తా నుంచి రహదారి అభివృద్ధి పనులు చేపడుతున్నామని, కొత్తపల్లి -హుస్నాబాద్, హుస్నాబాద్ – జనగామ మధ్య నాలుగు వరుసల రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
విద్యారంగంలో కోహెడలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం జరుగుతోందని, శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలకు భవనాల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. చిగురుమామిడిలో తెలంగాణ పబ్లిక్ స్కూల్, ఎల్కతుర్తిలో ఐఐఐటీ బ్రాంచ్, వంగరలో నవోదయ పాఠశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, సైదాపూర్‌కు మరో పబ్లిక్ స్కూల్ మంజూరు కానుందని తెలిపారు. అక్కన్నపేటలో పాఠశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు.
నియోజకవర్గంలో 250 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, అక్కన్నపేట, ఎల్కతుర్తి మండలాల్లో ఎమ్మార్వో కార్యాలయాలు మంజూరయ్యాయని, ఆర్డీవో కార్యాలయానికి సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేస్తున్నామని తెలిపారు.
గౌరవెల్లి ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రాజెక్టు కాలువలకు సంబంధించిన భూసేకరణ పనులు కొనసాగుతున్నాయని, భూసేకరణ పూర్తయిన వెంటనే కాలువల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఎంఎంఆర్ ప్యాకేజీ కింద కూడా పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. సాగునీటికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. పంటలు ఎండిపోకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని, పంట పూర్తయ్యే వరకు రాత్రి వేళల్లో కూడా విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ప్రస్తుత నీటి నిల్వలను వచ్చే వేసవిలో తాగునీటి అవసరాలకు కూడా వినియోగించుకోవాల్సి ఉందని, అందువల్ల నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు పంటలు సాగు చేయాలని, ఈ సీజన్లో వరి సాగును వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని రైతులను కోరారు.
ప్రకృతి వైపరీత్యాలు, ఎల్‌నినో ప్రభావం వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ఈ అంశాలపై కేబినెట్లో కూడా చర్చించినట్లు తెలిపారు. ఈ సమయంలో రాజకీయాలకు అతీతంగా రైతులకు అండగా నిలవాలని అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేశారు.
పల్లె పల్లెకు పొన్నం అన్న పల్లెల్లో ప్రజా పాలన కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్నామని, సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచుకోవాలని ప్రజలకు సూచిస్తున్నామని చెప్పారు.
గత పదేళ్లలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇచ్చారో ప్రజలకు తెలుసునని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం హుస్నాబాద్ నియోజకవర్గంలో ఒక్క ఏడాదిలోనే 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని, హుస్నాబాద్ పట్టణంలో 500 ఇళ్లు కేటాయించామని తెలిపారు.
గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చామని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ నిష్పక్షపాతంగా ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.
నియోజకవర్గంలో ఎక్కడ ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనా సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. ప్రభుత్వ భూములను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని, ఆక్రమణలపై ప్రజలు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా ప్రజల సమస్యలను విజ్ఞాపనల ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
హుస్నాబాద్ నియోజకవర్గాన్ని పర్యాటకం, విద్య, వైద్యం, రహదారులు, సాగునీరు, క్రీడలు తదితర అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులందరూ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు.
