గోదావరి–కావేరి లింక్‌పై తెలంగాణ హక్కులకు ముప్పు: హరీశ్‌రావు

గోదావరి–కావేరి లింక్‌పై తెలంగాణ హక్కులకు ముప్పు: హరీశ్‌రావు

 

హైదరాబాద్‌, వెలుతురు, అక్టోబర్ 17 : గోదావరి–కావేరి నదుల అనుసంధానం పేరుతో తెలంగాణ నీటి హక్కులకు ముప్పు వాటిల్లే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు ఆరోపించారు. నవంబర్‌ 3న ఢిల్లీలో జరిగే NWDA సమావేశం ఎజెండాలో గోదావరి–కావేరి లింక్‌ను చేర్చారని, దీనిని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవాల్సి ఉన్నా సీఎం రేవంత్‌రెడ్డి మౌనం వహిస్తున్నారని విమర్శించారు. పోలవరం నుంచి బొల్లపల్లి మీదుగా నీటిని తరలించే ప్రతిపాదనతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు.

 

ఛత్తీస్‌గఢ్‌ వినియోగించని 148 టీఎంసీలను మళ్లించే ప్రతిపాదనలో తెలంగాణకు 43, ఏపీకి 44, తమిళనాడుకు 42.5, కర్ణాటకకు 16, పుదుచ్చేరికి 2.5 టీఎంసీలు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇచ్చంపల్లి–నాగార్జునసాగర్‌ మార్గాన్ని మార్చి బొల్లపల్లి వైపు మళ్లిస్తే తెలంగాణకు సాగు, తాగునీరు, పరిశ్రమల అవసరాలపై ప్రభావం పడుతుందని చెప్పారు. తెలంగాణకు కేటాయించిన నీటి హక్కులు కాపాడాలని, ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

 

రాష్ట్రంలో కరువు పరిస్థితులకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని హరీశ్‌రావు ఆరోపించారు. దేవాదుల, కన్నెపల్లి, కల్వకుర్తి ప్రాజెక్టుల్లో పూర్తి సామర్థ్యంతో మోటార్లు ఎందుకు నడపలేదని ప్రశ్నించారు. ఈ అంశంపై అఖిలపక్షాన్ని పంపుల వద్దకు తీసుకెళ్లేందుకు సిద్ధమని సవాల్‌ చేశారు. సమావేశంలో గంగుల కమలాకర్‌, సత్యవతి రాథోడ్‌, కాలేరు వెంకటేష్‌, గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.