అమరజ్యోతి ప్రాంగణంలో బతుకమ్మను పేర్చిన మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 17 :
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. సచివాలయం సమీపంలోని అమరజ్యోతి ప్రాంగణంలో మహిళలతో కలిసి తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చారు. పూలను అందంగా పేర్చి బతుకమ్మను సిద్ధం చేసిన అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో మమేకమైన జీవనశైలికి ప్రతీకగా నిలిచే బతుకమ్మను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మంత్రి సీతక్క మహిళలతో మమేకమై బతుకమ్మ పేర్చడంతో అమరజ్యోతి ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళల ఐక్యత, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటిచెప్పేలా వేడుకలు సాగాయి. అంతకుముందు తన నివాసమైన ప్రజాభవన్లో కాంగ్రెస్ మహిళా నేతలు, వ్యక్తిగత సిబ్బందితో కలిసి మంత్రి సీతక్క తీరొక్క పూలతో అందంగా బతుకమ్మను పేర్చారు.
