సద్దుల బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న బీజేపీ మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పనా యాదవ్
చౌటుప్పల్, వెలుతురు, అక్టోబర్ 18 :
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పనా యాదవ్ పాల్గొన్నారు. ప్రకృతి ఒడిలో విరబూసే రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, తీరొక్క పూలతో బతుకమ్మలను అలంకరించి భక్తిశ్రద్ధలతో వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలతో కలిసి కడారి కల్పనా యాదవ్ బతుకమ్మ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ సందడి చేశారు. ఆడపడుచులతో మమేకమై పండుగ సంబరాల్లో పాల్గొని వారిలో నూతన ఉత్సాహాన్ని నింపారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతిపై ప్రేమకు, మన సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న ఇటువంటి పండుగలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, కుటుంబ బంధాలకు, సామాజిక సమైక్యతకు నిదర్శనమని తెలిపారు. పూల పండుగగా పేరుగాంచిన బతుకమ్మ వేడుకలు చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో ఆనందోత్సాహాల మధ్య కొనసాగాయి. మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు.
