- 24 గంటల్లో వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి
- మొదటి పేజీలో క్షమాపణ ప్రచురించాలి: ఎన్నారై బీఆర్ఎస్ డిమాండ్
- ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ దురుద్దేశంతో కథనాలు ప్రచురించడం సరికాదు
- ఆధారాలు ప్రజల ముందుంచాలి.. లేకుంటే ప్రపంచవ్యాప్తంగా నిరసనలు: అనిల్ కూర్మాచలం
లండన్, వెలుతురు, అక్టోబర్ 18:
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా V6 వెలుగు పత్రికలో ప్రచురితమైన ‘కేసీఆర్ ఫామ్ హౌస్కు మళ్లిన కొండపోచమ్మ’ అనే కథనాన్ని ఎన్నారై బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. ఈ కథనంపై పత్రిక యాజమాన్యం వెంటనే స్పందించి కేసీఆర్కు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం డిమాండ్ చేశారు. లండన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు రవి రేతినేని, కార్యదర్శి రవి ప్రదీప్ పులుసుతో కలిసి ఆయన మాట్లాడారు.
V6 వెలుగు పత్రిక ప్రజా సమస్యలపై దృష్టి సారించాల్సింది పోయి, రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తోందని అనిల్ కూర్మాచలం విమర్శించారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడం మీడియా బాధ్యతని పేర్కొన్నారు. అయితే, ప్రజా సమస్యలను పక్కనపెట్టి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కథనాలు ప్రచురించడం పాత్రికేయ విలువలకు విరుద్ధమని అన్నారు.
మేడిగడ్డ వద్ద నీరు అందుబాటులో ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందించే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అనిల్ కూర్మాచలం పేర్కొన్నారు. ప్రాణహిత జలాల వినియోగం, సాగునీటి సరఫరాపై ప్రజలకు సమాధానాలు అందించాల్సిన సమయంలో కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుని కథనాలు ప్రచురించడం ఏమిటని ప్రశ్నించారు.
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి
V6 వెలుగు ప్రచురించిన కథనాలపై బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఇప్పటికే పత్రిక యాజమాన్యానికి, ఎడిటర్కు నోటీసులు జారీ చేసిందని అనిల్ కూర్మాచలం తెలిపారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు పేర్కొన్నారు. ఎన్నారై బీఆర్ఎస్ తరఫున కూడా పత్రిక యాజమాన్యం తక్షణమే స్పందించి కేసీఆర్కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి కథనాలను ఇకపై ఉపేక్షించబోమని, అవసరమైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్నారైలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రత్యక్ష నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని అనిల్ కూర్మాచలం హెచ్చరించారు.
కథనాలకు ఆధారాలు చూపాలి: రవి రేతినేని
కొండపోచమ్మ సాగర్, కాలువల మార్గాలను కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంతో ముడిపెడుతూ ప్రచురించిన కథనాలకు సంబంధించిన ఆధారాలను V6 వెలుగు ప్రజల ముందుంచాలని ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు రవి రేతినేని డిమాండ్ చేశారు. ఆరోపణలు ప్రచురించేటప్పుడు వాస్తవాలను నిర్ధారించుకోవడం, సంబంధిత ఆధారాలను పరిశీలించడం మీడియా బాధ్యతని అన్నారు.
మొదటి పేజీలో క్షమాపణ ప్రచురించాలి: రవి ప్రదీప్ పులుసు
వివాదాస్పద కథనాన్ని 24 గంటల్లో ఉపసంహరించుకుని, కేసీఆర్కు క్షమాపణను పత్రిక మొదటి పేజీలో తగిన ప్రాధాన్యంతో ప్రచురించాలని ఎన్నారై బీఆర్ఎస్ కార్యదర్శి రవి ప్రదీప్ పులుసు డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వడం, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడం, నిష్పాక్షికంగా వ్యవహరించడం మీడియా ప్రధాన బాధ్యతలని ఆయన పేర్కొన్నారు. ఆ బాధ్యతను విస్మరించి రాజకీయ ప్రయోజనాలకు వేదికగా మారడం ప్రజాస్వామ్యానికి, పాత్రికేయ రంగానికి మంచిది కాదని హితవు పలికారు.
