టామ్ కామ్‌ను టామ్ స్కాంగా మార్చారు : ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్

టామ్ కామ్‌ను టామ్ స్కాంగా మార్చారు : ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్

 

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 29 :  కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి, స్కాం క్యాలెండర్‌ను అమలు చేస్తోందని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మిక శాఖ ఆధ్వర్యంలోని టామ్ కామ్ ద్వారా విదేశీ ఉద్యోగాల పేరుతో వందలాది మంది నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు.

 

జర్మనీలో ఉద్యోగాలు కల్పిస్తామని అభ్యర్థుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.4.1 లక్షలు వసూలు చేశారని, శిక్షణ పూర్తి చేసి అర్హత సాధించినప్పటికీ పదిమందిని కూడా జర్మనీకి పంపలేదని పేర్కొన్నారు. బాధితులకు పూర్తి ఫీజులు తిరిగి చెల్లించాలని, ఫేర్ స్ట్రీట్ కంపెనీపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై మంత్రి వివేక్ వెంకటస్వామి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు.

 

కాంగ్రెస్ పాలనలో వరుసగా కుంభకోణాలు జరుగుతున్నాయని విమర్శిస్తూ, ప్రభుత్వం ఉద్యోగాల కల్పనపై స్పష్టమైన వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ తరఫున పోరాడతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తుంగబాలు, నారాయణ, రఘురాం, అరుణ, యాదయ్య గౌడ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.