ఏడాదిలోగా కరీంనగర్లో గల్లీగల్లీకీ అంతర్గత రోడ్లు : బండి సంజయ్
కరీంనగర్, వెలుతురు, నవంబర్ 09: కరీంనగర్ అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు లేనిపోని వివాదాలు సృష్టిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో డంపింగ్ యార్డ్ సమస్యను పట్టించుకోలేదని, నిధులు కేటాయించలేదని అన్నారు. తాము అమృత్ పథకం కింద రూ.17 కోట్లు, యూసీఎఫ్ కింద మరో రూ.80 కోట్లతో సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. టెండర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పనులను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కరీంనగర్ ప్రజలు ఇలాంటి వారి మాటలు నమ్మి అభివృద్ధికి ఆటంకం కలిగించవద్దని కోరారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన, రాంనగర్ డివిజన్లో రూ.1.5 కోట్లతో చేపట్టనున్న బాక్స్ టైప్ నిర్మాణ పనులను ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, ఏడాదిలోగా నగరంలోని అన్ని డివిజన్లలో గల్లీగల్లీకీ అంతర్గత రోడ్లు నిర్మించడమే లక్ష్యమని వెల్లడించారు.
