పేదల ఇళ్లలో దీపావళి వెలుగులు నింపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

పేదల ఇళ్లలో దీపావళి వెలుగులు నింపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 08 :  తెలంగాణలో ఈ ఏడాది దీపావళి పండుగ ఆదివారం ప్రత్యేకతను సంతరించుకుంది. దీపావళి పండుగ అంటే నిజమైన అర్థం ఏమిటో చాటిచెబుతూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మానవీయతకు ప్రతీకగా నిలిచారు. మధిర నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పర్యటిస్తూ, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి ‘మా ఇందిరమ్మ ఇంటిలో దీపావళి’ కార్యక్రమంలో పాల్గొని వారి ఆనందంలో భాగస్వాములయ్యారు.

 

తెలంగాణలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఇళ్లలో దీపావళి వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ఏడాది దీపావళి తనకు ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్నారు.

 

“ఒకరి జీవితాల్లో మరొకరు ఆనందాన్ని నింపినప్పుడే దీపావళి పండుగకు నిజమైన సార్థకత చేకూరుతుంది. సమాజంలోని నిరుపేదలు, బలహీన వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందినప్పుడే ప్రగతికి నిజమైన అర్థం ఉంటుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల అభ్యున్నతి పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిబద్ధతకు నిదర్శనం” అని ఉప ముఖ్యమంత్రి అన్నారు.

 

ఈ దీపావళి సందర్భంగా తన ఆకాంక్షను వ్యక్తం చేస్తూ.. “ఏ ఒక్క ఇల్లు ఆశలు లేని గృహంగా మిగిలిపోకూడదు. ఏ ఒక్క కుటుంబం అభివృద్ధి ఫలాలకు దూరం కాకూడదు. తెలంగాణలోని ప్రతి ఇంటికీ ఆనందం, సంతోషం, అవకాశాల వెలుగులు చేరాలి” అని ఆకాంక్షించారు.

 

2023లో తాను చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని గుర్తుచేసుకుంటూ, ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత నిరుపేదలకు సొంత ఇళ్లు నిర్మించి ఇస్తామని మాట ఇచ్చానని భట్టి విక్రమార్క తెలిపారు.

 

“గతంలో శిథిలావస్థకు చేరిన గుడిసెలు, తాత్కాలిక నివాసాల్లో జీవనం సాగించిన పేద కుటుంబాలకు నేడు పక్కా ఇళ్లు అందాయి. ఆ కుటుంబాలు తమ సొంత ఇళ్లలో దీపావళి జరుపుకుంటుండటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. దీపావళి పర్వదినాన సొంతింటి కల నెరవేరిన కుటుంబాలతో కలిసి పండుగ జరుపుకోవడం నా జీవితంలో ప్రత్యేకమైన అనుభూతి” అని పేర్కొన్నారు.

 

ఆదివారం మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం, మధిర, బోనకల్, చింతకాని, ముదిగొండ మండలాల్లోని ఎనిమిది గ్రామాల్లో ఉప ముఖ్యమంత్రి పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలను స్వయంగా కలుసుకుని, తమ జీవితాల్లో తొలిసారిగా సొంతింటిలో దీపావళి పండుగ జరుపుకుంటున్న వారి సంతోషంలో పాలుపంచుకున్నారు.

 

ఈ సందర్భంగా బంజారా గ్రామంలో రెడ్డిబోయిన నాగమణి కుటుంబంతో, పెద్దగోపవరం గ్రామంలో మోదుగు సీతారాజ్యం కుటుంబంతో, దెందుకూరులో ముప్పసాని కృష్ణవేణితో, మల్లారంలో యందర్తి ఆచారావుతో, రాయన్నపేటలో ప్రసంగి గోపితో, పొద్దుటూరులో రెల్లా రాశితో, వి.వి. కిష్టాపురంలో పరికపల్లి గంగాభవానితో, ముదిగొండ గ్రామంలో కటారి శ్రీలత కుటుంబంతో కలిసి ‘మా ఇందిరమ్మ ఇంటిలో దీపావళి’ వేడుకలను భట్టి విక్రమార్క ఘనంగా జరుపుకున్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాకుండా, వారి సంతోషాల్లోనూ భాగస్వాములవుతూ ప్రజా ప్రభుత్వం ప్రజల పక్షాన నిలుస్తోందని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.