21 ఏళ్ల తర్వాత కలిసి మాట్లాడుకున్న జగ్గారెడ్డి, హరీశ్‌రావు
సంగారెడ్డి, వెలుతురు, నవంబర్ 28 :
రాజకీయంగా భిన్న పార్టీల్లో కొనసాగుతున్న కాంగ్రెస్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు 21 ఏళ్ల తర్వాత వ్యక్తిగతంగా కలుసుకున్నారు. జగ్గారెడ్డి నివాసానికి వెళ్లిన హరీశ్‌రావు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ఆప్యాయంగా పలకరించుకుని కొద్దిసేపు ముచ్చటించుకున్నారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. 2004లో హరీశ్‌రావు మంత్రిగా ఉన్న సమయంలో ఆయనను కలిసి ఛాంబర్‌లో కలిసి భోజనం చేసేవారమని గుర్తుచేశారు. ఆ తర్వాత తాను కాంగ్రెస్‌లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనను వ్యక్తిగతంగా కలవలేదన్నారు. దాదాపు 21 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఓ కుటుంబ వేడుకలో మళ్లీ కలుసుకున్నామని తెలిపారు.
తన కుమార్తె వివాహానికి హరీశ్‌రావును ఆహ్వానించలేకపోయానని, అయితే ఈ కార్యక్రమానికి ఆయన తప్పకుండా రావాలనే ఉద్దేశంతో ఆహ్వానించానని చెప్పారు. గతంలో అనేక కుటుంబ వేడుకలకు కూడా ఆయనను పిలవలేకపోయానన్నారు. హరీశ్‌రావు పదేళ్లపాటు మంత్రిగా ఉన్న సమయంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కలుసుకోలేదని పేర్కొన్నారు.
తమ ఇద్దరి కలయికలో ఎలాంటి రాజకీయాలు, అంతర్గత మతలబులు లేవని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాలు రాజకీయాలేనని, హరీశ్‌రావు బీఆర్‌ఎస్‌లో అగ్రనేతగా ఉన్నారని, తాను కాంగ్రెస్‌లో కీలక స్థాయిలో కొనసాగుతున్నానని అన్నారు. ఈ కలయికను పూర్తిగా వ్యక్తిగత, కుటుంబపరమైన ఆత్మీయ సమావేశంగానే చూడాలని పేర్కొన్నారు.
