గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో అవకతవకలు.. బీఆర్ఎస్ ఫిర్యాదు
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 28 :
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి విడుదలైన ముసాయిదా ఓటర్ల జాబితాలో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయని బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్‌కుమార్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దేవీప్రసాద్, పల్లె రవికుమార్, టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద తదితరులు సీఈఓను కలిసి వినతిపత్రం సమర్పించారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితా తయారీలో చోటుచేసుకున్న లోపాలను పరిశీలించి, అర్హులైన పట్టభద్రులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. జాబితాలోని తప్పులు, అవకతవకలపై సమగ్రంగా విచారణ జరిపి, అవసరమైన సవరణలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితా పారదర్శకంగా, లోపరహితంగా ఉండేలా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కోరింది. ఇటీవలే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. ఈ జాబితాలపై అభ్యంతరాలు, సవరణలకు డిసెంబర్ 10 వరకు అవకాశం కల్పించారు.
