- జీ7 సదస్సులో భారత నావికుల భద్రతపై మోదీ ప్రస్తావించారని వ్యాఖ్య
- వాణిజ్య నౌకా సిబ్బందిని లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్న భారత్ వైఖరి
- కాంగ్రెస్ విమర్శల వేళ థరూర్ వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరం
- రాహుల్ గాంధీపై భాజపా నేత ప్రదీప్ భండారీ విమర్శలు
- *జాతీయ ప్రయోజనాల విషయంలో మోదీ ముందుంటారని ప్రశంస
ఢిల్లీ వెలుతురు జూన్ 20:కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారత నావికుల భద్రత అంశాన్ని జీ7 సదస్సులో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. యుద్ధ సమయంలో వాణిజ్య నౌకల్లో పనిచేస్తున్న సిబ్బందిని లక్ష్యంగా చేసుకోవడం సరైన చర్య కాదన్న భారత వైఖరిని ప్రధాని స్పష్టంగా వివరించారని పేర్కొన్నారు.
ఇటీవల ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన ఘటనపై జీ7 సదస్సులో ప్రధాని మోదీ బహిరంగంగా స్పందించలేదంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. భారతీయుల భద్రతకు సంబంధించిన అంశాన్ని అంతర్జాతీయ వేదికపై బలంగా ప్రస్తావించడంలో ప్రధాని విఫలమయ్యారని ఆరోపించింది. ఈ తరుణంలోనే శశిథరూర్ చేసిన ప్రశంసలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
థరూర్ వ్యాఖ్యలపై భాజపా అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ స్పందించారు. ప్రధాని మోదీ విదేశాంగ విధానాన్ని కాంగ్రెస్ నేతలే ప్రశంసిస్తున్నారని పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాలను కాపాడడంలో ప్రధాని మోదీకి ప్రాధాన్యం ఉంటే, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడటంలో రాహుల్ గాంధీ ముందుంటారని విమర్శించారు. రాహుల్ గాంధీకి సొంత పార్టీలోనే పూర్తి మద్దతు లేదని ఎద్దేవా చేస్తూ, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు రావడం రాజకీయంగా ఆసక్తికర పరిణామమని అన్నారు.
