బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు భారీగా రోడ్లపైకి వచ్చిన హిందువులు

  • ఢాకాలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ జై శ్రీరామ్ నినాదాలతో ఆందోళన
  • శ్రీరాముడి చిత్ర అవమానంపై ఆగ్రహం 81 అడుగుల విగ్రహానికి ఆటంకం
  • అతివాదుల బెదిరింపులతో వాయిదా
  • వేలాదిగా తరలివచ్చిన హిందూ సంఘాలు
    ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు
  • 72 గంటల్లో నిందితుల అరెస్ట్‌ డిమాండ్
  • రంగ్‌పూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు
    ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిక

బంగ్లాదేశ్‌ వెలుతురు జూన్ 20:బంగ్లాదేశ్‌లో మరోసారి మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగాయి. శ్రీరాముడి చిత్రాన్ని అవమానించారనే ఆరోపణలతో హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగాయి. రాజధాని ఢాకాలో వేలాది మంది హిందువులు కాగడాలు, కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహిస్తూ జై శ్రీరామ్ నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఆందోళనలు కొనసాగుతున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఉత్తర గాయిబంద జిల్లాలోని శ్రీశ్రీ రాధాగోవింద దేవాలయ కమిటీ 81 అడుగుల ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేపట్టింది. అయితే ఈ కార్యక్రమానికి అతివాద సంస్థల నుంచి బెదిరింపులు రావడంతో విగ్రహ ప్రతిష్ఠాపనను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇదే సమయంలో శ్రీరాముడి చిత్రంపై చెప్పు ఉంచి అవమానించారనే ఆరోపణలు వెలువడటంతో హిందూ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.

ఈ ఘటనకు నిరసనగా శుక్రవారం ఢాకాలోని షహబాగ్ కూడలి వద్ద హిందూ మహాజ్యోత్ సంస్థ పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో ప్రజలు, వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు చేరుకున్నారు. అక్కడి నుంచి నేషనల్ ప్రెస్ క్లబ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చేతుల్లో కాగడాలు, కొవ్వొత్తులు పట్టుకుని జై శ్రీరామ్ నినాదాలతో ముందుకు సాగారు. అనంతరం ప్రెస్‌క్లబ్‌ ఎదుట మానవహారం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు.

మరోవైపు ఢాకా రిపోర్టర్స్ యూనిటీ భవనం ఎదుట కూడా పలువురు హిందూ సంఘాల ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. మైనారిటీలపై జరుగుతున్న దాడులు, మతవిశ్వాసాల అవమానంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.

రంగ్‌పూర్‌లో నిరసన ప్రదర్శన చేపట్టిన వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు, నిరసనకారులకు మధ్య తోపులాట జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. దీంతో కొంతసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

మైనారిటీలపై వరుసగా దాడులు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని నిరసనకారులు ఆరోపించారు. తమ మత విశ్వాసాలను అవమానించిన వారిని వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటన వెనుక ఉన్న వారిని 72 గంటల్లోగా అరెస్టు చేయాలని ప్రభుత్వానికి అల్టిమేటమ్ జారీ చేశారు.

డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హిందువుల మతపరమైన హక్కులు, భద్రతకు ప్రభుత్వం పూర్తి హామీ ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం ఈ ఘటన బంగ్లాదేశ్‌లో మరోసారి మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది.

Leave A Reply

Your email address will not be published.