- విద్య, సంక్షేమం, ఉపాధితో బీసీల సాధికారతే లక్ష్యం
- ఎసెస్సీ లో రాష్ట్ర సగటును అధిగమించిన బీసీ హాస్టల్ విద్యార్థులు
- ప్రతి హాస్టల్ విద్యా వికాసానికి కేంద్రంగా మారాలి
- విద్యార్థుల భద్రత, పోషకాహారం, నాణ్యమైన విద్యపై ప్రత్యేక దృష్టి
- బోనాల పండుగ నేపథ్యంలో జూలై 14-24 మధ్య హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో కుల వృత్తుల ప్రదర్శన మట్టి కుండల స్టాల్స్ ఏర్పాటు
- బీసీ స్టడీ సర్కిళ్లలో మరిన్ని సంస్కరణలు జరగాలి
- త్వరలో సిద్దిపేట లో నూతనంగా నిర్మించిన బీసీ స్టడీ సర్కిల్ భవనం ప్రారంభం
- బీసీ సంక్షేమ శాఖ పనితీరుపై రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ వెలుతురు జూన్ 20:బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని జిల్లా బీసీ అభివృద్ధి అధికారులు, సహాయ బీసీ అభివృద్ధి అధికారులు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్లు మరియు శాఖాధికారులతో ప్రజా భవన్ లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల విద్యా, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా బీసీ యువతను సాధికారత కలిగిన వర్గంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.2025-26 విద్యా సంవత్సరంలో బీసీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు 96.05 శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమని మంత్రి తెలిపారు. రాష్ట్ర సగటు ఉత్తీర్ణత శాతం 95.15 కంటే ఇది అధికమని పేర్కొన్నారు. పరీక్షలకు హాజరైన 4,941 మంది విద్యార్థుల్లో 4,746 మంది ఉత్తీర్ణులయ్యారని, రాష్ట్రవ్యాప్తంగా 285 హాస్టళ్లు 100 శాతం ఫలితాలు సాధించాయని వెల్లడించారు. 641 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారని తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో బీసీ హాస్టళ్లలో 51.63 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, హనుమకొండ జిల్లాలు మెరుగైన ఫలితాలు సాధించాయని తెలిపారు. రెండో సంవత్సరం పరీక్షల్లో 71.85 శాతం ఉత్తీర్ణత నమోదైందని, హనుమకొండ, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాలు ఉత్తమ ఫలితాలు సాధించాయని వెల్లడించారు. తక్కువ ఫలితాలు సాధించిన జిల్లా అధికారులను మందలించారు. ఈ సంవత్సరం మంచి మార్కులు సాధించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు కోసం ప్రత్యేక శిక్షణ, మెంటరింగ్, మోడల్ పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. అదనపు విద్యా సహాయం అవసరమైన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.ఈ విద్యా సంవత్సరంలో బీసీ సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు యూనిఫాం క్లాత్, నోట్‌బుక్స్, బెడ్‌షీట్లు, ట్రంక్ బాక్స్, స్కూల్ బ్యాగ్, ట్రాక్‌సూట్, షూస్, సాక్స్, బ్లాంకెట్లు, స్టేషనరీ సామగ్రి తదితర అవసరమైన వస్తువులతో కూడిన సమగ్ర వెల్కమ్ కిట్ అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
హాస్టళ్లలో ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలని, రిజర్వేషన్ విధానం ప్రకారం అడ్మిషన్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. జూన్ నెలాఖరులోపు అన్ని హాస్టళ్లలో పేరెంట్-టీచర్ సమావేశాలు నిర్వహించి విద్యార్థుల పురోగతి, హాస్టల్ సౌకర్యాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.విద్యార్థుల భద్రత, ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. హాస్టల్ ప్రాంగణాల పరిశుభ్రత, కలుపు మొక్కల తొలగింపు, నిల్వ నీటి నిర్మూలన, ఎలుకల బొరియల తొలగింపు, పెస్ట్ కంట్రోల్, ఫాగింగ్, వాటర్ ట్యాంకుల శుభ్రపరిచే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. RO ప్లాంట్లు, వాటర్ కూలర్లు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన, పోషకాహారం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. నిర్ణీత డైట్ మెనూను కచ్చితంగా అమలు చేయడంతో పాటు నాణ్యమైన బియ్యం, పప్పులు, కూరగాయలు, గుడ్లు, పాలు సరఫరా చేయాలని సూచించారు.
ప్రతి విద్యార్థికి అకడమిక్ ప్రొఫైల్, ఆరోగ్య ప్రొఫైల్ రూపొందించి వారి విద్యా పురోగతి, ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. పరీక్షల ఒత్తిడి, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం పెంపు కోసం కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న SEED పథకం ద్వారా DNT, NT, SNT వర్గాల అభివృద్ధికి అందుతున్న ప్రయోజనాలపై అర్హులైన లబ్ధిదారులకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.బోనాల పండుగ సందర్భంగా జూలై 14 నుండి 24 మధ్య హెచ్ఎండియే గ్రౌండ్స్ వద్ద కుల వృత్తుల ప్రదర్శన, మట్టి కుండల స్టాల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 33 జిల్లా వెనుకబడిన తరగతుల సర్పంచ్ లు , ఉప సర్పంచ్ లు , కార్పొరేటర్లు , కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు , నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారితో జిల్లా బీసీ అభివృద్ధి అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేసి బీసీ సంక్షేమశాఖ అమలు చేస్తున్న పథకాలు సంక్షేమ కార్యక్రమాలపై చర్చించాలన్నారు. కుట్టు మిషన్ పథకంలో జిల్లా కలెక్టర్ లతో బీసీ సంక్షేమ అధికారులు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.బీసీ, ఈబీసీ వర్గాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి పథకం దరఖాస్తుల పెండింగ్ లేకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తహసీల్దార్, ఆర్డీఓ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రాధాన్యతగా పరిష్కరించి అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో గ్రీన్ ఛానల్ ద్వారా ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
బీసీ స్టడీ సర్కిల్లో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని సూచించారు. 12 యూట్యూబ్ ఛానల్స్ ద్వారా నిరంతరం పోటీ పరీక్షలకు గైడ్లైన్స్ అడుగుతున్నామని , స్టడీ సర్కిల్ ఇయర్ బుక్ విడుదల చేశామని తెలిపారు.మోటివేషనల్ సాంగ్ ద్వారా విద్యార్థుల ప్రేరణ కల్పిస్తున్నామని తెలిపారు. మంచి అనుభవం ఉన్న ఫాకల్టీ ద్వారా శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు.త్వరలో సిద్దిపేట లో స్వంత స్టడీ సర్కిల్ భవనం ప్రారంభం కానుందని తెలిపారు. సొంత భవనాలు నిర్మాణం పూర్తి చేసి అందులో విషయ పరిజ్ఞానం ఉన్న చిత్రాలు, చార్టులు, మ్యాపులు రూపొందించామని ఆదేశించారు.రాష్ట్రంలోని 12 బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా UPSC, గ్రూప్స్, SSC, బ్యాంకింగ్, RRB తదితర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నామని మంత్రి తెలిపారు.
సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమశాఖ ప్రభుత్వ సలహాదారు వి. హన్మంతరావు, బీసీ సంక్షేమశాఖ కమిషనర్ బాలమయదేవి, బీసీ సంక్షేమశాఖ అధికారులు మల్లయ్య బట్టు,అలోక్ కుమార్, మామిడి హరికృష్ణ, జిల్లా బీసీ అభివృద్ధి అధికారులు , సహాయ బీసీ అభివృద్ధి అధికారులు , బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ లు , వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
