- తెలంగాణలో జాతీయ రహదారులు, రైల్వేలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ సహకారం: డా. కె.లక్ష్మణ్
హైదరాబాద్, వెలుతురు జూన్ 20, 2026:ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గత పన్నెండు సంవత్సరాల కాలంలో దేశం సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మహిళా సాధికారతలో చరిత్రాత్మక పురోగతిని సాధించిందని రాజ్యసభ సభ్యులు డా. కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. శనివారం కవాడిగూడలో పత్రికా సమాచార కార్యాలయం(పీఐబీ), హైదరాబాద్ నిర్వహించిన ‘వార్త’ మీడియా ఇంటరాక్షన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పీఎం స్వనిధి, పీఎం ముద్రా యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జనధన్ యోజన వంటి పథకాలు దేశంలోని పేదలు, మహిళలు, సామాజికంగా వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరిచాయని అన్నారు.
ఉజ్వల పథకం ద్వారా 11 కోట్లకు పైగా మహిళలు ప్రయోజనం పొందారని, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా కోట్లాది కుటుంబాలకు మరుగుదొడ్లు అందుబాటులోకి రావడంతో మహిళల ఆత్మగౌరవం, భద్రత మరింత పెరిగిందని తెలిపారు. 81 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆరోగ్య భద్రత కల్పించడం వంటి కార్యక్రమాలు ప్రపంచంలోనే అతిపెద్ద పంక్షేమ కార్యక్రమాలని పేర్కొన్నారు. జన్ ధన్–ఆధార్–మొబైల్(జామ్) త్రివేణి ఆధారంగా సాంకేతికతను వినియోగించి ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా మధ్యవర్తుల ప్రమేయాన్ని తొలగించి, పారదర్శకతను పెంపొందించారని తెలిపారు. లక్ష్యబద్ధమైన సంక్షేమ కార్యక్రమాల ఫలితంగా గత దశాబ్దంలో సుమారు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో అనేక దశాబ్దాల కాలంలో సుమారు 5 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు అభివృద్ధి కాగా, గత 12 ఏళ్లలోనే మరో 5 వేల కిలోమీటర్లను రూ.1.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడితో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. రైల్వే రంగంలో తెలంగాణకు కేంద్రం విశేష ప్రాధాన్యం కల్పించిందని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం, చర్లపల్లి టెర్మినల్ నిర్మాణం, కాజీపేటలో రైల్వే తయారీ యూనిట్ ఏర్పాటు, మెదక్, సిద్దిపేట, కొమురవెల్లి ప్రాంతాలకు రైల్వే అనుసంధాన విస్తరణ వంటి కీలక ప్రాజెక్టులను ఆయన ప్రస్తావించారు.
తెలంగాణకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, హైదరాబాద్‌ను బెంగళూరు, చెన్నై, పుణే నగరాలతో అనుసంధానించే హైస్పీడ్ రైలు కారిడార్లను తాజాగా బడ్జెట్‌లో ప్రకటించారని గుర్తు చేశారు. మామునూర్, ఆదిలాబాద్ విమానాశ్రయాల అభివృద్ధితో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడే అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్రం సహకరిస్తోందని పేర్కొన్నారు.
“సబ్‌కా సాథ్ – సబ్‌కా వికాస్ – సబ్‌కా విశ్వాస్ – సబ్‌కా ప్రయాస్” అనే మంత్రంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, సమగ్రాభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, సంక్షేమ పాలన ద్వారా వికసిత భారత్ లక్ష్య సాధన దిశగా దేశం వేగంగా పయనిస్తోందని డా. లక్ష్మణ్ అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీనియర్ జర్నలిస్టు శ్రీ కస్తూరి రాకా సుధాకర్ రావు.. సమర్థవంతమైన సమాచార ప్రసారం, ప్రజలతో ప్రత్యక్ష అనుసంధానం మంచి పాలనకు కీలకమని పేర్కొన్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ ప్రభుత్వాలపై విశ్వాసాన్ని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు. నరేంద్రమోదీ.ఇన్, మైగవ్ పోర్టల్, సామాజిక మాధ్యమాలు, ‘మన్ కీ బాత్’ వంటి వేదికలు ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు నేరుగా చేరవేయడంతో పాటు ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే అవకాశాన్ని కల్పించాయని తెలిపారు.
విద్య, పరీక్షల సన్నద్ధత, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై యువతతో నిరంతర అనుసంధానం అవసరమని, ఈ దిశగా ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని చేపడుతున్నారని, ఎగ్జామ్ వారియర్స్ పుస్తకం రాశారని గుర్తు చేశారు. ఇవి యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు భారతీయ సంస్కృతి, విలువల పట్ల అవగాహనను బలోపేతం చేస్తున్నాయని చెప్పారు. డిజిటల్ వేదికలు ప్రజాభిప్రాయ నిర్మాణం, విజ్ఞాన విస్తరణ, సాంస్కృతిక చైతన్యంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. స్థానిక భాషల పరిరక్షణ, స్థానిక కథనాల ప్రాచుర్యం సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు ఇవి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో తప్పుడు సమాచార వ్యాప్తి, ప్రజాభిప్రాయాలపై దుష్ప్రభావం చూపే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు.
పీఐబీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీమతి శృతి పాటిల్ తన ప్రారంభోపన్యాసంలో మాట్లాడుతూ.. వార్త పేరుతో పీఐబీ కార్యశాలలు నిర్వహిస్తోందని అన్నారు. విలేకరులకు, ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల వారికి అవగాహన, వృత్తిపరమైన నైపుణ్యాల పెంపు, సామర్థ్యాభివృద్ధికి ఈ కార్యశాల ఉపయోగపడుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, పథకాలు, వాటి ప్రభావంపై అర్థవంతమైన చర్చలకు ఇది దోహదపడుతోందని పేర్కొన్నారు. పత్రికా సమాచార కార్యాలయం దేశవ్యాప్తంగా జర్నలిస్టులతో అనుసంధానం కోసం ‘వార్తాలాప్’, ‘వార్త’ వంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తోందని ఆమె తెలిపారు. గత పన్నెండు సంవత్సరాలలో దేశం సాధించిన అభివృద్ధి, విజయాలు, వాటి ప్రభావంపై ఈ కార్యక్రమాల్లో విస్తృత చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. మీడియా ప్రతినిధులు చురుకుగా పాల్గొని ప్రజలకు కచ్చితమైన, విశ్వసనీయమైన సమాచారాన్ని చేరవేయడంలో తమ వంతు పాత్ర పోషించాలని ఆమె పిలుపునిచ్చారు.
