చిన్నారులు, మహిళల సంక్షేమానికి అమలవుతున్న పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి – మంత్రి సీతక్క

  • బాల్య వివాహాలు, చిన్నారులపై వేధింపులు లేని తెలంగాణ లక్ష్యంగా పనిచేయాలి
  • జిల్లా అధికారుల‌కు మంత్రి సీత‌క్క దిశానిర్దేశం

హైదరాబాద్, వెలుతురు జూన్ 20:చిన్నారులు, మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు ఇవ్వాలంటే అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా.ద‌న‌స‌రి అన‌సూయ సీతక్క సూచించారు. బాల్య వివాహ‌లు, చిన్నారులపై వేధింపులు, దాడులు లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చే ల‌క్ష్యంతో ప‌నిచేయాల‌న్నారు. యూసుఫ్‌గూడలోని జాతీయ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల సంస్థ (NIMSME)లో మిషన్ వాత్సల్య, సాక్ష్యం అంగన్వాడి, మిషన్ శక్తి పథకాల అమలు పురోగతిపై నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, కమిషన్ సభ్యులు కంచర్ల వందన గౌడ్, బి. అపర్ణ, మర్రిపల్లి చందన, గోగుల సరిత, ప్రేమలతా అగర్వాల్, బి. వచన్ కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, జాయింట్ డైరెక్టర్ మోతి, జిల్లా మహిళా సంక్షేమ అధికారులు, జిల్లా బాలల సంరక్షణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, చిన్నారుల రక్షణ, సంరక్షణ, వారి హక్కుల పరిరక్షణ కోసం అమలు చేస్తున్న మిషన్ వాత్సల్య పథకం అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న పిల్లలు, అనాథలు, నిరాశ్రయ చిన్నారులకు భద్రత కల్పించడంతో పాటు వారి భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ఈ పథకం పనిచేస్తోందన్నారు. చిన్నారులపై వేధింపులు, దాడులు లేదా ఇతర దుర్ఘటనలు చోటుచేసుకున్నప్పుడు అధికారులు వెంటనే స్పందించాలని, ఘటన జరిగిన వెంటనే పైస్థాయి అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. బాధిత చిన్నారులు తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉంటారని, వారితో సున్నితంగా వ్యవహరిస్తూ అవసరమైన కౌన్సెలింగ్ అందించాలని సూచించారు.

అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా సాక్ష్యం అంగన్వాడి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. చిన్నారులకు పోషకాహారం, ప్రాథమిక విద్య, ఆరోగ్య సేవలు సమగ్రంగా అందించడంతో పాటు గర్భిణులు, బాలింతల ఆరోగ్య సంరక్షణకు కూడా ఈ కార్యక్రమం దోహదపడుతోందన్నారు. భవిష్యత్ తరాల అభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాలు పునాదులుగా నిలుస్తాయని, అందువల్ల వాటి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదన్నారు.

మహిళల భద్రత, రక్షణ, సాధికారత కోసం అమలు చేస్తున్న మిషన్ శక్తి కార్యక్రమాన్ని కూడా అధికారులు సమర్థవంతంగా అమలు చేయాలని మంత్రి సూచించారు. మహిళలు హింస, వివక్ష, వేధింపులకు గురికాకుండా రక్షణ కల్పించడంతో పాటు ఆర్థికంగా, సామాజికంగా వారిని బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని చెప్పారు. మహిళా సంక్షేమం, చిన్నారుల సంక్షేమం పరస్పర సంబంధం కలిగిన అంశాలని, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.

బాల్య వివాహాల నిర్మూలనలో పెద్దపల్లి జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి సీతక్క ప్రశంసించారు. బాల్య వివాహ రహిత జిల్లాగా పెద్దపల్లి సాధించిన విజయాన్ని ఆదర్శంగా తీసుకుని తెలంగాణను “జీరో చైల్డ్ మ్యారేజెస్” రాష్ట్రంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అలాగే చిన్నారులపై వేధింపులు, దాడులు లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు జిల్లా మహిళా సంక్షేమ అధికారులు, జిల్లా బాలల సంరక్షణ అధికారులు, సెర్ప్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

“చిన్నారుల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరేలా పనిచేయండి. క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ మహిళలు, చిన్నారుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావాలి” అని మంత్రి సీతక్క అధికారులకు పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.