- ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలి
- ఖమ్మంలో ఓట్లపై ఆందోళన
లక్షన్నర ఓట్లు కోల్పోయే ప్రమాదం - ప్రతి ఓటును కాపాడుకోవాలి
- 55 శాతం ఓట్లపై ప్రభావం
అప్రమత్తం కాకపోతే భారీ నష్టం - అధికారులతో సమన్వయం అవసరం
- కార్యకర్తలకు తుమ్మల కీలక సూచనలు
ఖమ్మం వెలుతురు జూన్ 20:ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియపై పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా లేకపోతే భవిష్యత్తులో తీవ్ర రాజకీయ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. ప్రతి ఓటును కాపాడుకోవడం ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యత అని స్పష్టం చేశారు. ఓట్లను నిర్లక్ష్యం చేస్తే రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు.
శనివారం ఖమ్మంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ముఖ్య కార్యకర్తలతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై సమీక్ష నిర్వహించి పార్టీ నాయకులకు పలు కీలక సూచనలు చేశారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి బూత్ స్థాయిలో ఓటర్ల వివరాలను పరిశీలించాలని సూచించారు.
ఖమ్మం నియోజకవర్గంలో మొత్తం 3,02,800 మంది ఓటర్లు ఉండగా, అందులో సగం ఓట్లు కూడా ఇప్పటివరకు మ్యాపింగ్ కాలేదని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో లక్షన్నర మందికి పైగా ఓట్లు ప్రభావితమయ్యే ప్రమాదం కనిపిస్తోందని చెప్పారు. ఇప్పటికైనా ప్రతి కార్యకర్త అప్రమత్తమై ఒక్క ఓటు కూడా కోల్పోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం మూడు శాతం ఓట్ల తేడాతోనే విజయం సాధించామని గుర్తు చేసిన తుమ్మల, ఓటర్ల జాబితాలో చిన్న మార్పులు కూడా ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియలో 55 శాతానికి పైగా ఓట్లు ప్రభావితమయ్యే పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని తేలికగా తీసుకుంటే పార్టీకి తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు.
రాజకీయాల్లో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికీ ఓటర్ల జాబితా అత్యంత కీలకమని మంత్రి అన్నారు. ఓట్లను కాపాడుకోవడంలో విఫలమైతే భవిష్యత్తులో రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమవుతుందని వ్యాఖ్యానించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌కు ఎదురైన రాజకీయ పరిస్థితులను గుర్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితా ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ప్రతి నాయకుడు అర్థం చేసుకోవాలన్నారు. రాజకీయాల్లో ఉన్నవారికి ఇది జీవన్మరణ సమస్యతో సమానమని వ్యాఖ్యానించారు.
ఓట్ల తొలగింపుపై వివిధ రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయని తుమ్మల అన్నారు. బీజేపీ కావాలనే ఓట్లను తొలగిస్తోందని ఒకవైపు, మరో పార్టీ మరో విధంగా వ్యవహరిస్తోందని మరోవైపు ప్రచారాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే అలాంటి ప్రచారాలపై కాకుండా వాస్తవ పరిస్థితులపై దృష్టి సారించి ఓటర్ల హక్కులను కాపాడుకోవడమే ముఖ్యమని చెప్పారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అధికారులతో సమన్వయం ఎంతో అవసరమని మంత్రి సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని అన్నారు. ప్రతి ఓటరు వివరాలను సరిచూసుకుని, అర్హులైన వారందరి పేర్లు ఓటర్ల జాబితాలో ఉండేలా కృషి చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
ఓటు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన హక్కు అని, దానిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండి ప్రతి ఓటును పరిరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.
