తెలంగాణలో బీజేపీదే అధికారం: రామచందర్‌రావు

హైదరాబాద్ వెలుతురు జూన్ 30:

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. ఘట్‌కేసర్‌లో జరిగిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం కాలంలో తనపై విశ్వాసం ఉంచి ప్రతి అడుగులోనూ అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

ఇదే సహకారం, ఇదే ఆశీర్వాదం రాబోయే రోజుల్లో కూడా కొనసాగాలని ఆకాంక్షించారు. భారతీయ జనతా పార్టీ ఒక్క వ్యక్తి ఆధారంగా నడిచే పార్టీ కాదని, కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని పేర్కొన్నారు. అందరూ ‘టీమ్‌ బీజేపీ’ స్ఫూర్తితో పనిచేస్తూ ప్రతి కార్యక్రమంలో, ప్రతి ఎన్నికలో విజయాన్ని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

తెలంగాణకు పార్టీ జాతీయ నాయకత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రామచందర్‌రావు పేర్కొన్నారు. జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నితిన్‌ నబీన్‌ మూడు రోజుల పాటు తెలంగాణలో విస్తృతంగా పర్యటించి కార్యకర్తలను కలవడం, రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరై పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశం చేయడం ఇందుకు నిదర్శనమని అన్నారు.

జాతీయ అధ్యక్షుడిగా నితిన్‌ నబీన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అస్సాంలో మూడోసారి, పుదుచ్చేరిలో రెండోసారి, పశ్చిమ బెంగాల్‌లో తొలిసారి పార్టీ విజయాలు నమోదు చేసిందని గుర్తు చేశారు. అదే విజయపరంపర తెలంగాణలో కూడా కొనసాగుతుందనే పూర్తి విశ్వాసం తనకు ఉందన్నారు. రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో విజయపతాకం ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.