హైదరాబాద్, వెలుతురు, ఆగష్టు 13:
భావప్రకటన స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమని విద్వేష ప్రసంగాలు కమిటీ చైర్మన్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో హేట్ స్పీచ్ సెలెక్ట్ కమిటీ రెండవ సమావేశంలో అధ్యక్షతన వహించిన ఆయన మాట్లాడుతూ కులం, మతం, ప్రాంతం, భాష వంటి అంశాల ఆధారంగా ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు సామాజిక శాంతి, సామరస్యానికి భంగం కలిగించకుండా చూడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని అన్నారు.
హేట్ స్పీచ్‌ను అరికట్టేందుకు చట్టపరమైన అంశాలు, అమలులో ఎదురవుతున్న సమస్యలు, పోలీసు వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై సమగ్రంగా అధ్యయనం చేస్తున్నామని, ప్రజల భావప్రకటన హక్కును గౌరవిస్తూనే, ద్వేషాన్ని ప్రోత్సహించే చర్యలను నిరోధించే సమతుల్య విధానాన్ని రూపొందించడమే తమ కమిటీ లక్ష్యమని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అందరికీ చట్టం సమానంగా వర్తించేలా కమిటీ పని చేస్తుందని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో కమిటీ సభ్యులు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, కోవా లక్ష్మీ, మాణిక్ రావు, అబ్దుల్ బలాల, శాసనసభ కార్యదర్శి తిరుపతి, హోంశాఖ సెక్రటరీ, లా సెక్రటరీతో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

