హైదరాబాద్, వెలుతురు, ఆగష్టు 13:
చదువొక్కటే మన భవిష్యత్తును మార్చుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కొమురం భీమ్ ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన తెలంగాణ మైనారిటీల ప్రతిభా సదస్సులో పాల్గొని గ్రూప్ 1, 2, 3, 4 తదితర కేటగిరీల్లో జరిగిన ఉద్యోగ నియామకాల్లో ఎంపికైన, అలాగే నీట్, ఐఐటీ, ఎన్ఐటీ లాంటి జాతీయ స్థాయి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించినప్రతిభ కనబరిచిన 782 మంది మైనారిటీ అభ్యర్థులకు అవార్డులు ప్రదానం చేశారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. విద్యార్థులు స్కిల్స్ పై దృష్టి సారించాలని ప్రస్తుత పరిస్థితుల్లో స్కిల్స్ ఉంటే ఉద్యోగావకాశాలకు కొదవలేదని స్కిల్స్ ఉన్నవారికి జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో ఎన్నో ఉద్యోగావకాశాలు ఉన్నాయని అన్నారు. స్కిల్స్‌లో యువతను సిద్ధం చేయాలన్న లక్ష్యంతోనే ఐటీఐలను ఏటీసీలుగా, పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చామని తెలిపారు.
ముస్లింలకు కాంగ్రెస్ 4 శాతం రిజర్వేషన్లు కల్పించిందని, వీటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్ల రద్దు కోసం అత్యున్నత న్యాయస్థానాల వరకూ వెళ్లారని ముఖ్యమంత్రి విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే సెక్యులర్ పార్టీ అని, హిందూ, ముస్లింలను రెండుకళ్లలా చూస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో మైనారిటీలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వల్ల మైనారిటీలకే ఎక్కువగా ప్రయోజనం అందుతుందని అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్-1 పరీక్షలను నిర్వహించలేకపోయిందని సీఎం ఎద్దేవా చేశారు. ఓ ఆర్ఎంపీ డాక్టర్‌ను టీజీపీఎస్సీ సభ్యుడిగా నియమించారని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌తో పాటు నిపుణులతో సమాలోచనలు జరిపి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేశామన్నారు. రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను అడ్డుకోవాలని అనేక అడ్డంకులు స్రుస్థించిన, విద్యార్థుల శ్రేయస్సు కోసం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఉద్దండులైన న్యాయవాదులను నియమించి పోరాటం చేసి నియామకాలను పూర్తి చేశామని పేర్కొన్నారు.
ఎంతో పారదర్శకంగా గ్రూప్-1 పరీక్షలు నిర్వహించామని, వరల్డ్ బాక్సింగ్ కప్‌లో స్వర్ణం సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నిఖత్ జరీన్ కోసం నిబంధనలు పక్కనపెట్టి మరీ గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చామని, అలాగే క్రికెటర్ సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగం కల్పించామని సీఎం రేవంత్ గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన అభ్యర్థులు తెలంగాణ రైజింగ్ కోసం పనిచేయాలని పిలుపనిచ్చారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు మహమ్మద్ అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మీర్ జుల్ఫేకర్ అలీ, నవీన్ యాదవ్, కాలే యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, టీజీఎంఆర్‌ఈఐఎస్ ఉప చైర్మన్ మహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

