- 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి గుర్తుగా మిడ్జిల్‌లో కృతజ్ఞత సభ
- ఊరుకొండ ఆలయ దర్శనం.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన
హైదరాబాద్ వెలుతురు జూలై 03:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ప్రజాప్రతినిధిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, జడ్పీటీసీగా తనకు రాజకీయ జన్మనిచ్చిన మిడ్జిల్‌లో కృతజ్ఞత సభ నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేటకు చేరుకోనున్న సీఎం.. అక్కడి ఊరుకొండ ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు ఆలయ ఆవరణలో ఆత్మీయులు, ఆనాటి పెద్దలతో ఏర్పాటు చేసిన భోజనం, మాటాముచ్చట కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు ఊరుకొండపేట నుంచి రోడ్డు మార్గంలో మిడ్జిల్‌కు బయలుదేరి 2.45 గంటలకు మండల కేంద్రానికి చేరుకొని వెల్జాల క్రాస్ రోడ్డు వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే ద్యాప గోపాల్ రెడ్డి (గుడిగానిపల్లి గోపాల్ రెడ్డి) విగ్రహాలను ఆవిష్కరించనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుని మిడ్జిల్ మండలంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్థలంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు. తదనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్న రేవంత్ రెడ్డి, ప్రజా ప్రతినిధిగా రాజకీయాల్లోకి పంపిన ప్రజలకు సీఎంగా తన కృతజ్ఞత తెలపనున్నారు.
