తెలంగాణ ప్రజా కళ కు నీరాజనాలు

పాల్కురికి సొమన్న మూలలో  101 రోజుల సాంస్కృతిక కళ ప్రదర్శనలు

ఆటలు చూడండి-పాటలు చూడండి.
పాల్కురికి సోమన్నమూలను చూడండి.
తెలంగాణ ప్రజాకళ వేదిక చూడండి
101 రోజుల్లో కవులు ,కళాకారుల జోరును చూడండి. రవీంద్రభారతిలో …. మన రవీంద్రభారతిలో అంటూ కవులు, కళాకారులు పాడుకున్నారు.

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 101 రోజుల పాటు నిర్వహించిన తెలంగాణ  ప్రజాకళకు కవులు, కళాకారులు, సాహిత్యాభిమానులు, కళాభిమానులు, ప్రజలు కళా నీరాజనాలు పలికారు. ప్రజా ప్రభుత్వం నిర్వహించిన “ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక” లో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడంతోపాటు ప్రజల నుండి వచ్చే వినతులను పరిష్కారం చూపుట కొరకు 99 రోజుల కార్యక్రమం ఐదు దశల్లో నిర్వహించింది. ఇందులో భాగంగా తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ మాత్రం ప్రత్యేకంగా 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 1వ తేదీ నుండి జులై 10 వరకు 101 రోజుల పాటు రవీంద్రభారతిలోని పాల్కురికి సోమన్న మూలలో ‘తెలంగాణ ప్రజా కళ’ ఎంతో అద్భుతంగా నిర్వహించింది.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వంలో భాషా సాంస్కృతిక శాఖామంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో శాఖ కార్యదర్శి ఏ. వాణి ప్రసాద్ ఐఎఎస్, సంచాలకులు డాక్టర్. ఏనుగు నరసింహారెడ్డి ఐఎఎస్, పర్యవేక్షణలో ఏఓ డాక్టర్. విజయకుమార్, సాంస్కృతిక శాఖ సిబ్బంది 101 రోజుల కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘తెలంగాణ ప్రజాకళ’ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుండి నేటి వరకు ఇంకా ఇప్పటివరకు రవీంద్రభారతి వేదిక ఎక్కని కళాకారుల ప్రదర్శనకు మొదటి ప్రాధాన్యత ఇచ్చింది ‘తెలంగాణ ప్రజాకళ’.   తెలంగాణ ప్రజాకళ పేరిట 101 రోజుల సాంస్కృతిక కళారూపాల ప్రదర్శన కార్యక్రమాలు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 8.30 గంటల వరకు రవీంద్రభారతిలోని  పాల్కురికి సోమన్న మూల వేదికలో జరిగాయి.

ప్రతిరోజు నిర్వహించిన తెలంగాణలోని అనేక రకాల సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించడానికి హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని నలుమూలల నుండి ప్రజలు హాజరయ్యరు. ఇక్కడ జరుగుతున్న అద్భుతమైన కళాప్రదర్శన విషయాలను హాజరైనవారే విస్తృతంగా ప్రచారం చేశారు. భాషాసాంస్కృతిక శాఖ యూట్యూబ్ చానెల్ ద్వారా ప్రతిరోజు జరిగే కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం నిర్వహిస్తూ వేలాది కళాకారులకు ఈ ప్రజాకళ కార్యక్రమం చేరువ చేశారు. తెలంగాణలోని అన్ని కళలకు ప్రాధాన్యత కల్పిస్తూనే సాహిత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు పెద్దపీట వేశారు. జానపద కళారూపాలు, శాస్త్రీయ కళారూపాలు, చిందు యక్షగానం, కోలాటం, చిడతలభజన, అడుగుల భజన, హరికథ, బుర్రకథ, మైమ్, మ్యాజిక్, మిమిక్రీయే గాక పద్య నాటకాలు సాంఘిక నాటకాలతో పాటు సురభి కళాకారుల నాటకాలు, అష్టావధానం, కవిసమ్మేళనం ,మహిళాకవి సమ్మేళనం , తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూ, కన్నడలాంటి బహుభాషా కవి సమ్మేళనాలు , కథా, నవలాకారుల సమ్మేళనాలు నిర్వహించారు. వందలాది మంది కవులు, రచయితలు, కళాకారులు పాల్గొన్నారు.
అదేవిధంగా హైదరాబాది దక్కని సంస్కృతికి సంబంధించిన కళారూపాల ప్రదర్శన, ఆదివాసి సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల, యువతి యువకుల, కార్యక్రమాలతోపాటు జానపద సంగీతం, ఇతర రాష్ట్రాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల కోసం ప్రత్యేక వారం కేటాయించారు. దీంతోపాటు ప్రతిరోజు కొంతమంది నూతన ఔత్సాహిక కళాకారులకు కూడా ఈ వేదిక అవకాశాలు కల్పించింది.

సాంస్కృతిక శాఖ పరిధిలో ఉన్న సంగీత కళాశాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులతోపాటు అధ్యాపకులు కూడా ఈ ప్రజాకళలో పాల్గొని భరతనాట్యం,కూచిపూడి మరియు మృదంగం, డోలక్, వీణా, ఫ్లూట్ , వాయిలేన్ తో పాటు పలు వాయిద్య ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ప్రజాకళ 101 రోజుల కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ప్రజాప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రచారంతోపాటు తమ ఆటపాటల ద్వారా అందరిని ఆకట్టుకున్నారు. దీంతో రవీంద్ర భారతి ప్రాంగణమంతా ప్రతిరోజూ సాయంత్రం కోలాహలంగా మారింది. ప్రతినిత్యం జరిగే ఈ కార్యక్రమాలను తెలంగాణ సాంస్కృతిక సారధి అధికారి డాక్టర్ పి విజయ్ కుమార్ సాంస్కృతిక శాఖ సిబ్బందితోపాటు సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యులు హాజరై కార్యక్రమాలను తిలకిస్తూ ప్రదర్శనకు వస్తున్న కళాకారులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకు శాలువా, సర్టిఫికెట్లతో ఘనంగా సత్కరించడంతోపాటు భోజన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా భాషా సాంస్కృతికశాఖ ఈ విధంగా 99 రోజుల కార్యక్రమాలు నిర్వహించడంపై తెలంగాణలోని నలుమూలలకు చెందిన ప్రజలు,కళాకారులు,కవులు సాంస్కృతిక శాఖకు, ప్రజాప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.

ముచ్చర్ల దినకర్ రచయిత 

9440704535 

Leave A Reply

Your email address will not be published.