- కేవలం 5 రోజుల్లోనే రైతు భరోసా కింద 67.45 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,135.77 కోట్లు జమ
- నేడు 5 నుంచి 6 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతులకు రైతు భరోసా నిధుల విడుదల
- ఐదో విడతలో 1.69 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.545.41 కోట్లు జమ
- ఇచ్చిన హామీ మేరకు ప్రతి అర్హ రైతుకు రైతు భరోసా అందిస్తున్నాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, వెలుతురు జూలై 4:
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ రికార్డు స్థాయిలో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తోందని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత & జౌళి శాఖల మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జూన్ 30న రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వం కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే రూ.7,135.77 కోట్లను 67.45 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసి మరో రికార్డు సృష్టించిందన్నారు.
నేడు రైతు భరోసా పథకం ఐదో విడతలో 5 నుంచి 6 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతులకు రూ.545.41 కోట్లను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 1.69 లక్షల మంది రైతులు రైతు భరోసా సాయం పొందారని తెలిపారు.
ఈ సందర్భాంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటికే తొలి నాలుగు విడతలలో 4 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేశామని, నేడు 5 నుంచి 6 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతులందరికీ సాయం అందించామని పేర్కొన్నారు. ఇప్పటివరకు రైతు భరోసా పథకం కింద మొత్తం 67.45 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,135.77 కోట్లను ప్రభుత్వం జమ చేసినట్లు మంత్రి తెలిపారు. రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
