- ఫ్యూచర్ సిటీ-బందరు పోర్ట్ గ్రీన్‌ఫీల్డ్ రహదారికి అనుమతులు మంజూరు చేయండి
- రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మించాలి.
- జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
ఢిల్లీ వెలుతురు జూలై 14:
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి సంబంధించి ఇప్పటికే 95 శాతం భూసేకరణ పూర్తయినందున పనుల ప్రారంభానికి కేంద్ర క్యాబినెట్ అనుమతి ఇప్పించాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి గడ్కరీతో ఢిల్లీలోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.
ఆర్ఆర్ఆర్ రెండువైపులా ఏకకాలంలో పనులు ప్రారంభమైతే నిర్మాణం త్వరగా పూర్తవుందుని, నిర్మాణ వ్యయం తగ్గుతుందని సీఎం తెలిపారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానికి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మిస్తామని ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్నందున వెంటనే ఆ రహదారికి అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్‌కు 12 వరుసల రహదారి మంజూరు చేస్తే హైదరాబాద్-విజయవాడల మధ్య 100 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని సీఎం తెలిపారు. హైదరాబాద్‌ను బందరు పోర్ట్‌కు సరకు రవాణా వేగవంతమవుతుందని సీఎం వివరించారు.
మన్ననూరు-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించి అటవీ శాఖ అనుమతులు ఇప్పించేందుకు కృషి చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. నల్లమల అభయారణ్యం, శ్రీశైలం ఆలయం, శ్రీశైలం జలాశయాలు ఈ కారిడార్ పరిధిలో ఉంటాయని సీఎం తెలిపారు.
హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు ఉన్న రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు ఆరు వరుసల ప్రత్యామ్నాయ రహదారికి అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ ప్రత్యామ్నాయ రహదారికి అవసరమైన భూ సేకరణ తాము చేపడతామని సీఎం తెలిపారు. ఈ ప్రత్యామ్నాయ రహదారి వ్యవసాయ, వ్యాపారపరంగా నూతన అవకాశాలను సృష్టిస్తుందని సీఎం తెలిపారు.
ఈ సమావేశంలో నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారు, ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు, స్పెషల్ సెక్రటరీ కోఆర్డినేషన్ అద్వైత్ కుమార్ సింగ్ దితరులు పాల్గొన్నారు.
