ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల సాగు చెయ్యాలి: తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, వెలుతురు జూలై 14:

 

‘రైతు నేస్తం’ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. రైతులతో నేరుగా మాట్లాడి వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా వర్షపాతం తక్కువగా నమోదవుతోందన్నారు. దీంతో కృష్ణా, గోదావరి ఆయకట్టు ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా రైతులు పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.

భూగర్భ జలాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి రైతులకు సరైన సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, భూగర్భ జలాల శాఖ, భారత వాతావరణ శాఖ (IMD) అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వాలని చెప్పారు.

వర్షపాతం తక్కువగా ఉన్నందున జొన్న, సజ్జ, కొర్ర, పెసర, మినుము, కంది వంటి తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని మంత్రి సూచించారు. అలాగే శాస్త్రవేత్తలు సూచించిన విధంగా తక్కువ కాలంలో పండే, తక్కువ నీరు అవసరమయ్యే అధిక దిగుబడి పంట రకాలను ఎంచుకోవాలని రైతులకు సూచించారు.

ఈ సందర్భంగా ఐఐఎంఆర్ డైరెక్టర్ మాట్లాడుతూ కొర్ర, సజ్జ, జొన్న వంటి చిరుధాన్యాల సాగును పెంచాలని రైతులకు సూచించారు.

భారత వాతావరణ శాఖ (IMD), హైదరాబాద్ సంచాలకురాలు స్టెల్లా మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటివరకు సాధారణం కంటే 30 నుంచి 35 శాతం వరకు తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. వచ్చే మూడు నెలల్లో కూడా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున తక్కువ నీరు అవసరమయ్యే పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.

ఇరిగేషన్ శాఖ అధికారులు మాట్లాడుతూ ఎగువ రాష్ట్రాల్లో కూడా వర్షపాతం తక్కువగా ఉండటంతో కృష్ణా, గోదావరి నదుల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉందన్నారు. అందువల్ల నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటలు సాగు చేయాలని సూచించారు.

భూగర్భ జలాల శాఖ డైరెక్టర్ జిల్లాల వారీగా భూగర్భ జలాల పరిస్థితిని వివరించారు. రాబోయే రోజుల్లో నీటి మట్టం మరింత తగ్గే అవకాశం ఉన్నందున వరి, చెరకు వంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.

రైతు నేస్తం కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ కె. సురేంద్రమోహన్, ఐఏఎస్, వ్యవసాయ శాఖ సంచాలకులు శ్రీ బి. గోపి, ఐఏఎస్, సహకార శాఖ ప్రత్యేక సంచాలకులు శ్రీ రాహుల్ రాజ్, ఐఏఎస్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆల్తాస్ జానయ్య, నీటిపారుదల శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ (ఈఎన్‌సీ) శ్రీ మధుసూదన్ రావు, భూగర్భ జలాల శాఖ సంచాలకులు శ్రీ లక్ష్మణ్, భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ (IIMR) డైరెక్టర్ డాక్టర్ సత్యవతి, భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ సంచాలకులు శ్రీమతి స్టెల్లా, ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ శ్రావణి, భారత నూనెగింజల పరిశోధన సంస్థ (IIOR) డైరెక్టర్ డాక్టర్ సురేష్, మెట్ట పరిశోధన సంస్థ (CRIDA) శాస్త్రవేత్త డాక్టర్ కె.వి. రావు, అలాగే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ మహాదేవప్ప పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయా రంగాలకు సంబంధించిన నిపుణులు రైతులకు ఎల్‌నినో పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే పంటల నిర్వహణ, నీటి వినియోగం, ప్రత్యామ్నాయ పంటల సాగు, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై పలు సూచనలు చేశారు.

 

Leave A Reply

Your email address will not be published.