వేర్‌హౌసింగ్ సామర్థ్యాన్ని మరో 5 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచుతాం: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

  • జిల్లాల వారిగా రానున్న 20 సంవత్సరాల గిడ్డంగుల అవసరాల మీద ఒక సంపూర్ణ అధ్యాయం చేయాలి.
  • దీర్ఘకాలిక అవసరాలకు అనుగుణంగా గోదాముల నిర్మాణం చేపట్టాలి. 
  • గిడ్డంగులలో నిల్వ ఉంచిన సరకు నాణ్యత ప్రమాణాలు దెబ్బతినకుండా తీసుకోవాల్సిన శాస్త్రీయ విధానాల అధ్యయనం చేయాలి. 
  • వడ్డీ భారాన్ని తగ్గించుకుని ఆర్థికంగా బలోపేతం కావాలి – ప్రభుత్వ కార్పొరేషన్లకు మంత్రి తుమ్మల సూచన

హైదరాబాద్ వెలుతురు జూలై 15:

రాష్ట్రంలో రైతులకు శాస్త్రీయ గోదాముల సౌకర్యాన్ని మరింత విస్తరించేందుకు తెలంగాణ రాష్ట్ర వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా వచ్చే రెండేళ్లలో ప్రస్తుతం ఉన్న సామర్థ్యానికి అదనంగా మరో 5 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత & జౌళి శాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలంటే వడ్డీ భారాన్ని తగ్గించుకుంటూ ఆదాయ వనరులను పెంచుకోవాలని సూచించారు.

బుధవారం  సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర వేర్‌హౌసింగ్ కార్పొరేషన్, మార్క్‌ఫెడ్, హాకా కార్పొరేషన్‌ల మేనేజింగ్ డైరెక్టర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు.  ఆయా కార్పొరేషన్ల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు,  ఆర్థిక పరిస్థితి, గోదాముల వినియోగం, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలు, ఆదాయ వృద్ధి అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఆధీనంలో 52 స్వంత గోదాములు ఉండగా వాటి మొత్తం నిల్వ సామర్థ్యం సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నులని తెలిపారు. ప్రస్తుతం ఈ గోదాముల్లో 104 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదై 6.33 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ ఉన్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీలు, పీఈజీ, ఇన్వెస్టర్ గోదాములు, అద్దె గోదాములతో కలిపి మొత్తం 524 గోదాములను ప్రస్తుతం వినియోగిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తులకు అనుగుణంగా గోదాముల సామర్థ్యాన్ని విస్తరిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం 48 కొత్త గోదాముల నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతోందన్నారు.

మొదటి దశలో నిర్మిస్తున్న 17 గోదాములను 2027 జనవరి నాటికి పూర్తి చేసి సుమారు 2.12 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. రెండో దశలో 31 గోదాములను 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేసి మరో 3.66 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని కల్పించనున్నట్లు వివరించారు. అదనంగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరో 32 గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, వీటి ద్వారా మరో 3.25 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. మొత్తంగా రాష్ట్రంలో సుమారు 15 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యాన్ని కల్పించేలా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు.

కొత్తగా నిర్మించే ప్రతి గోదాముపై తప్పనిసరిగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గోదాముల అవసరాలకు కావలసిన విద్యుత్‌ను స్వయంగా ఉత్పత్తి చేసుకోవడంతో పాటు మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించి అదనపు ఆదాయం సమకూర్చుకునే విధంగా రెడ్కో (REDCO) సంస్థతో చర్చించి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రభుత్వ కార్పొరేషన్లు ఆదాయాన్ని పెంచుకునే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.

మార్క్‌ఫెడ్, మార్కెటింగ్, హాకా, వేర్‌హౌసింగ్ వంటి ప్రభుత్వ సంస్థల ఆధీనంలో ఉన్న గోదాములన్నింటినీ ఒకే సమన్వయ వ్యవస్థ కింద నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని మంత్రి సూచించారు. దీంతో నిర్వహణ వ్యయాలు తగ్గడంతో పాటు ప్రభుత్వ వనరులను సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే కేంద్ర వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌తో సమన్వయం పెంచి రాష్ట్రానికి రావలసిన సహకారం, నిధులు, ఇతర ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ టర్నోవర్ ప్రతి సంవత్సరం పెరుగుతున్నప్పటికీ అదే స్థాయిలో ఖర్చులు పెరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. అవసరం లేకుండా ప్రైవేట్ గోదాములను అద్దెకు తీసుకోవడం వల్ల ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడుతుందని పేర్కొన్నారు. ముందుగా మార్క్‌ఫెడ్, హాకా, మార్కెటింగ్ వంటి ప్రభుత్వ కార్పొరేషన్ల ఆధీనంలో ఉన్న గోదాముల్లో ఎక్కడ ఖాళీలు ఉన్నాయో గుర్తించి వాటినే పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, ఇందుకోసం అన్ని కార్పొరేషన్ల మేనేజింగ్ డైరెక్టర్లు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

కొత్తగా నిర్మిస్తున్న గోదాముల పనులను నాణ్యతతో పూర్తి చేయడానికి ప్రత్యేక ఇంజనీరింగ్ అధికారులను నియమించుకోవాలని మంత్రి సూచించారు. తగిన సాంకేతిక సిబ్బంది ఉంటేనే నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షించి నాణ్యమైన గోదాములను అందుబాటులోకి తీసుకురావడం సాధ్యమవుతుందని చెప్పారు. గోదాముల నిర్మాణానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న ఆధునిక నమూనాలను అధ్యయనం చేసి, ఎక్కువకాలం మన్నికగా ఉండే, శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణమైన డిజైన్లను మాత్రమే ఎంపిక చేయాలని, పాత తరహా నమూనాలకు స్వస్తి పలకాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో రైతుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక వేర్‌హౌసింగ్ మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, ప్రభుత్వ కార్పొరేషన్లను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడం, సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ వ్యయాలను తగ్గించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆదాయ వనరులను పెంచడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.