- ఆర్ధిక సంఘం నిధులను దారి మళ్లిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు
- లేనిపక్షంలో కేంద్ర నిధులను నేరుగా పంచాయతీ అకౌంట్లలోనే జమ చేసే అంశాన్ని పరిశీలిస్తాం
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరు మార్చుకోవాలి
- గడువులోగా అమ్రుత్ పనులు పూర్తి చేయకుంటే చర్యలు తప్పవు
- నిధులు వెనక్కు వెళ్లే ప్రమాదం ఉంది
- కేంద్ర నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతోంది
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
- సిరిసిల్లలో రూ.105 కోట్లతో కార్గిల్ చెరువు పునరుద్దరణ పనులకు కేంద్ర మంత్రి శంకుస్థాపన
సిరిసిల్ల వెలుతురు జూలై 17:
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం విడుదల చేస్తున్న 15వ ఆర్ధిక సంఘం నిధులను కరెంట్ బిల్లులు, సిబ్బంది జీతభత్యాలకు మళ్లించడం దుర్మార్గమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సర్పంచులను బెదిరించి, ఒత్తిడి తెస్తోందన్నారు. ‘‘అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులను కరెంట్ బిల్లులు, జీతాలకు ఎట్లా మళ్లిస్తారు? ఇది నిబంధనలకు విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే కేంద్రానికి లేఖ రాయాల్సి ఉంటుంది. అవసరమైతే ఆర్ధిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తాం’’అని చెప్పారు. గ్రామ పంచాయతీల కరెంట్ బిల్లులు, సిబ్బంది జీత భత్యాలకు కూడా నిధులివ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా? అని మండిపడ్డారు.
సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శుక్రవారం రోజున సిరిసిల్ల పట్టణంలో పర్యటించారు. అమ్రుత్ 2 స్కీం కింద రూ.105 కోట్ల నిధుల అంచనా వ్యయంతో చేపట్టిన కార్గిల్ చెరువు పునరుద్దరణ, సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. పక్కనే ఉన్న కార్గిల్ యుద్ద శకటాన్ని సందర్శించారు. కార్గిల్ యుద్దంలో వీర మరణం పొందిన జవాన్లకు నివాళులు అర్పించారు. జై జవాన్, జై కిసాన్ అంటూ నినదించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్రుత్ 2 స్కీం కింద రూ.1.32 కోట్లతో కార్గిల్ చెరువు పునరుద్దరణ, సుందరీకరణ పనులు చేపట్టి ఈ చెరువును సుందరంగా తీర్చిదిదుతున్నామని, మురుగునీరు రాకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కేంద్రం అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులను కరెంట్ బిల్లులు, జీతాలకు ఎట్లా మళ్లిస్తారన్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని, రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే కేంద్రానికి లేఖ రాయాల్సి ఉంటుందన్నారు. అవసరమైతే ఆర్ధిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. గ్రామ పంచాయతీల కరెంట్ బిల్లులు, సిబ్బంది జీత భత్యాలకు కూడా నిధులివ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.
నిజానికి అమ్రుత్ స్కీంను గొప్ప ఆశయంతో ప్రధానమంత్రి మోదీగారు ప్రవేశపెట్టారు. పట్టణాల్లో ప్రతి ఇంటికి నూటికి నూరు శాతం నల్లా కనెక్షన్ అందించడంతోపాటు మురుగునీటి(సీవరేజ్) సౌకర్యం కల్పించడం, పట్టణాలను వాటర్ సెక్యూర్ సిటీస్ గా తీర్చిదిద్దాలనే గొప్ప లక్ష్యంతో మోదీగారు 2015లో అమృత్ (AMRUT – Atal Mission for Rejuvenation and Urban Transformation) పథకాన్ని ప్రారంభించారు. అమృత్ 1 మిషన్ కింద రూ.77 వేల 640 కోట్ల వ్యయం అంచనా వేస్తే కేంద్రం 35 వేల 990 కోట్లు కేటాయించింది. 2021 నాటికి అమృత్ 1 స్కీం పూర్తయ్యింది. ఆ తరువాత 2021 అక్టోబర్ లో అమృత్ 2 స్కీం పేరుతో 2 లక్షల 99 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తే, అందులో కేంద్రం తన వాటాగా 76 వేల 760 కోట్లు కేటాయించింది.
తెలంగాణ రాష్ట్రానికి అమృత్ 1 కింద 1660 కోట్లు, అమృత్ 2 కింద 3వేల 429 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు సిరిసిల్ల, వేములవాడ, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీలు అమ్రుత్ పథకం కింద దాదాపు 400 కోట్ల రూపాయలను కేటాయించింది. అందులో ఈ సిరిసిల్ల మున్సిపాలిటీకి 105 కోట్ల 57 లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నామని తెలిపారు.
కేంద్రం పెద్ద ఎత్తున తెలంగాణకు నిధులిస్తోంది. 12 ఏళ్లలో 13 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. అయినా కేంద్రం ఏమిచ్చింది.తెలంగాణకు అన్యాయం చేస్తుందంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్దాలాడుతున్నారు. అసలు తెలంగాణలో అంతో ఇంతో అభివ్రుద్ది జరుగుతుందంటే కేంద్రం ఇస్తున్న నిధులే కారణమని, కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండున్నరేళ్లుగా నయాపైసా కూడా మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ఇవ్వడం ఇవ్వలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే తో పాటు పలువురు పాల్గొన్నారు.
