యుకె కు ఎగుమతులు పెంచుతాం: మంత్రి శ్రీధర్ బాబు

 

హైదరాబాద్ వెలుతురు జూలై 16:

భారత్- యునైటెడ్ కింగ్ డమ్ ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సిఇటిఏ) వల్ల తెలంగాణా గరిష్ఠ ప్రయోజనం పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఒప్పందం వల్ల దేశం నుంచి ఎగుమతి అయ్యే 99 శాతం పారిశ్రామిక ఉత్పత్తులపై యుకె సుంకాలను తొలగించిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. యుకె డిప్యూటి ట్రేడ్ కమిషనర్ (దక్షిణాసియా) చంద్రు కె అయర్ (Chandru K Iyer) ఆధ్వర్యంలో గురువారం నాడు సచివాలయంలో తనను కలిసిన ప్రతినిధి బృందంతో శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. సమావేశంలో ఎమ్మెల్సీ, పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు.

ఈ ఒప్పందం వల్ల ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం భారీగా వృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేసారు. రెండు దేశాల మధ్య రూ.3.25 లక్షల కోట్ల (25 Billion Pounds) వాణిజ్యానికి అవకాశం ఉందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. తెలంగాణాలో పారిశ్రామిక వస్తూత్పత్తి, లైఫ్ సైన్సెస్, ఏవియేషన్, డిఫెన్స్, ఐటి, సెమికండక్టర్స్, చిప్ ల డిజైన్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులకు అత్యంత అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను వృద్ధి చేసామని, యుకె పారిశ్రామికవేత్తలు వీటిని వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రం నుంచి యుకెకు ప్రస్తుతం రూ.3,553 కోట్ల విలువైన ఎగుమతులు మాత్రమే జరుగుతున్నాయని తెలిపారు. కొత్త ఒప్పందం వల్ల కలిగే ప్రయోజనాల వల్ల ఎగుమతులను భారీగా పెంచుకునే అవకాశం ఏర్పడిందని వివరించారు.

దేశంలోని ఫార్మా ఉత్పత్తుల్లో 40 శాతం తెలంగాణాలోనే జరుగుతున్నాయని, వ్యాక్సిన్ ఎగుమతుత్లో 30 శాతం రాష్ట్రానిదేనని శ్రీధర్ బాబు తెలిపారు. విమానయాన రంగానికి అవసరమైన ప్రిసిషన్ విడిభాగాల ఉత్పత్తిలో తెలంగాణా అగ్రస్థానంలో ఉందని గుర్తు చేసారు. ప్రపంచ ప్రఖ్యాత ఏవియేషన్ సంస్థలు ఎయిర్ బస్, బోయింగ్, రోల్స్ రాయిస్, విమాన ఇంజన్ల తయారీ సంస్థ ప్రాట్ అండ్ విట్నీస్, డసో (Dassault) ఏవియేషన్ ఉత్పత్తి చేసే రఫేల్ విమానాల విడిభాగాల తయారీ, ఓవర్ హాలింగ్ సదుపాయాలు ఇక్కడ ఉన్నాయని తెలిపారు. టాటా అడ్వాన్సుడ్ సిస్టమ్స్, సఫ్రాన్ ఏవియేషన్ సంస్థలు పరిశ్రమలను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేసారు. హైదరాబాద్ లో ఫార్చ్యూన్ 500 కంపెనీలతో సహా పలు ప్రఖ్యాత సంస్థలు 450 జిసిసి కేంద్రాలను ఏర్పాటు చేసాయని చెప్పారు.

యుకెకు ఎగుమతి చేయగలిగే వస్తువుల తయారీపై స్థానిక పారిశ్రామిక వేత్తలతో సమావేశం ఏర్పాటు చేసి సిఇటిఏ ఒప్పందం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని ఇండస్ట్రీస్ స్పెషల్ సెక్రటరీ కృష్ణ ఆధిత్యకు శ్రీధర్ బాబు సూచించారు. యుకె నుంచి భారత్ పర్యటించే మేయర్ల బృందాన్ని హైదరాబాద్ ను కూడా సందర్శించేలా చూడాలని చంద్రు కె అయర్ ను మంత్రి కోరారు. అధికారులతో కలిసి యుకెను సందర్శించి అక్కడ పారిశ్రామిక, వాణిజ్య ఎకోసిస్టంను పరిశీలించాలని చంద్రు అయర్ శ్రీధర్ బాబును ఆహ్వానించారు. యుకె ప్రతినిధి బృందంలో సిద్దార్థ్ విశ్వనాథన్, నళిని రఘురామన్, ప్రవీణ్ పద్మనాభన్, పరిశ్రమల శాఖ స్సెషల్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.