న‌న్ను దెబ్బ తీసేందుకు కుట్ర‌: సీఎం రేవంత్ రెడ్డి

  • బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
  • కొడంగల్‌లో నన్ను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్రలు
  • రాష్ట్ర ప్రజలే కుట్ర‌ల‌ను తిప్పికొట్టాలని పిలుపు
  • రాష్ట్ర స్థాయి దృష్టి మళ్లించేందుకే ఇక్కడ పొగబెడుతున్నారు
  • కొడంగల్ పర్యటనలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు
  • కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు కుట్రలు
  • అప్రమత్తంగా ఉండాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి
  • భవిష్యత్తు రాజకీయం మహిళలదే
  • స్థానిక సంస్థల నుంచి చట్టసభల వరకు పెరగనున్న ఆధిపత్యం
  • పురుషులు బాధ్యతగా పనిచేయకపోతే ఇళ్లకే పరిమితం
  • రాహుల్, ప్రియాంక గాంధీల అరెస్ట్‌పై నిరసన ర్యాలీ
  • అంబేద్కర్ విగ్రహం వరకు సీఎం రేవంత్ పాదయాత్ర

కొడంగల్‌, జూన్ 22 (వెలుతురు):

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీల వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో తానను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఆ రెండు పార్టీలు లోపాయికారీగా ఒక్కటయ్యాయని సంచలన ఆరోపణలు చేశారు. కొడంగల్ పర్యటనలో భాగంగా రెండో రోజు మాట్లాడిన సీఎం, బీఆర్ఎస్, బీజేపీ సిద్ధాంతాలు వేరైనా, తన్ను రాజకీయంగా అనగదొక్కాలనే ప్రధాన లక్ష్యం మాత్రం వారిద్దరికీ ఒక్కటేనని ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను, విపక్షాల తప్పులను తాను నిలదీస్తున్నందుకే తనపై ఈ తరహా కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు.

రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం తాను రోజుకు 18 గంటల పాటు నిరంతరం కష్టపడుతున్నా సమయం సరిపోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొడంగల్‌లో తనను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక, స్థానికంగా ఇబ్బందులు సృష్టిస్తే తన ఫోకస్ అంతా ఇక్కడే ఉండిపోతుందని విపక్షాలు భావిస్తున్నాయన్నారు. కొడంగల్‌లోనే తనను కట్టిపడేస్తే రాష్ట్రస్థాయిలో పాలనపై దృష్టి పెట్టలేడని భావించి ఇక్కడ పొగబెడుతున్నారని విమర్శించారు. అయితే కొడంగల్‌లో తనకోసం ప్రాణమిచ్చే కాంగ్రెస్ సైనికులు ఉన్నారని, వారి ముందు ప్రత్యర్థుల కుట్రలు, కుతంత్రాలు ఏమాత్రం సాగవని ధీమా వ్యక్తం చేశారు.

కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన పేద ప్రజల ఓట్లను దొంగతనంగా తొలగించేందుకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని సీఎం ఆరోపించారు. తనకు రాజకీయంగా అండగా నిలిచి, గెలిపించిన కొడంగల్ ప్రజలే ఈ కుట్రదారులను క్షేత్రస్థాయిలోనే తిప్పికొట్టాలని, పొలిటికల్‌గా బొందపెట్టాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును అడ్డదారిలో తొలగించాలని చూసే వారి పట్ల నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మహిళా సాధికారత, రాజకీయ ప్రాతినిధ్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో రాజకీయ రంగంలో మహిళలదే పూర్తి ఆధిపత్యం నడుస్తుందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే 50 శాతం రిజర్వేషన్లు సాధించుకున్న మహిళలు, త్వరలోనే అమల్లోకి రానున్న చట్టసభల రిజర్వేషన్ల ద్వారా అసెంబ్లీ, పార్లమెంట్లలోనూ 33 శాతం స్థానాలు కైవసం చేసుకోబోతున్నారని గుర్తుచేశారు. దీనివల్ల నిర్ణయాధికారంలో మహిళల పాత్ర మరింత కీలకమవుతుందన్నారు.

మహిళల ప్రాతినిధ్యం పెరుగుతున్న తరుణంలో పురుషులు తమ ధోరణిని మార్చుకోవాలని సీఎం చమత్కరించారు. ఎప్పటికీ సమాజంలో, రాజకీయాల్లో మగవారిదే పెత్తనం అని భావించే రోజులకు కాలం చెల్లిపోయిందని వ్యాఖ్యానించారు. పురుషులు బాధ్యతాయుతంగా పనిచేసి తమ ఉనికిని కాపాడుకోకపోతే, రాబోయే రోజుల్లో ఇళ్లకే పరిమితమై వంట చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో సభలో నవ్వులు పూశాయి.

రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ/నమోదు ప్రక్రియపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని సీఎం సూచించారు. “ఓటు హక్కు లేని మనిషి జీవించి ఉన్నా చచ్చిపోయిన వారితో సమానం” అంటూ తీవ్రమైన వ్యాఖ్య చేశారు. ఓటరు జాబితాలో పేరు లేకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, లబ్ధి అందకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి ప్రతీ అర్హుడైన పౌరుడు ఎస్‌ఐఆర్ ఫారాలు పూర్తి చేసి తమ ఓటు హక్కును పదిలపరుచుకోవాలని కోరారు.

కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటికే 78 శాతానికి పైగా ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని సీఎం వెల్లడించారు. స్వయంగా తాను కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యమయ్యారు. తన సమాచారాన్ని సమగ్రంగా ఎస్‌ఐఆర్ ఫారంలో నమోదు చేసి, స్థానిక బూత్ లెవెల్ ఆఫీసర్‌కు (బీఎల్వో) స్వయంగా అందజేశారు. ప్రజాప్రతినిధులు ముందుకు ఉండి తమ తమ ప్రాంతాల్లో వంద శాతం ఓటర్ల నమోదు జరిగేలా చూడాలని ఈ సందర్భంగా అధికారులను, నాయకులను ఆదేశించారు.

అంతకుముందు, దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి భారీ నిరసన చేపట్టారు. కొడంగల్‌లోని తన నివాసం నుంచి మొదలుకొని సుమారు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న అంబేద్కర్  విగ్రహం వరకు పాదయాత్రగా వెళ్లారు. సీఎం వెంట కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.