- హైదరాబాద్‌లో కాలనీ సంక్షేమ సంఘాల భారీ ర్యాలీలు
- వరద కట్టడి, చెరువుల పరిరక్షణ చర్యలపై ప్రశంసలు
- హైడ్రాకు సంఘీభావంగా నగరంలో వీధినకెక్కిన ప్రజలు
- రూ. 1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల పరిరక్షణ
- 3325 ఎకరాల కబ్జా భూములను కాపాడిన వైనం
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయానికి సంపూర్ణ మద్దతు
- ఆక్రమణదారుల దుష్ప్రచారాన్ని ఖండించిన ప్రజలు
హైదరాబాద్, వెలుతురు ఆగస్టు 02:
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో వరద ముప్పు నివారణకు, కబ్జాలకు గురైన చెరువులను, ప్రభుత్వ భూములను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ వ్యవస్థకు ప్రజల నుంచి అపారమైన మద్దతు లభిస్తోంది. ప్రభుత్వ చర్యలను స్వాగతిస్తూ, హైడ్రా పనితీరును ప్రశంసిస్తూ నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, స్థానిక నివాసితులు ఆదివారం భారీ ర్యాలీలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవను కొనియాడుతూ, హైడ్రా అధికారులకు సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తూ నగర వీధుల్లో నినాదాలు చేశారు.
అమీర్‌పేట, మధురానగర్, శ్రీనివాసనగర్ వెస్ట్, వెంగల్ రావు నగర్ సహా చుట్టుపక్కల ఉన్న పదుల సంఖ్యలోని కాలనీల సంక్షేమ సంఘాలు ఈ ర్యాలీలలో ఉత్సాహంగా పాల్గొన్నాయి. కబ్జాదారులు, స్వార్థపరులు సోషల్ మీడియా వేదికగా హైడ్రా పై చేస్తున్న దుష్ప్రచారాన్ని నగరవాసులు తీవ్రంగా ఖండించారు. హైడ్రా వల్ల తమ ప్రాంతాల్లో వరద ముప్పు తగ్గిందని, ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతు ఉందంటూ వివిధ కాలనీల ప్రతినిధులు వీడియో సందేశాలు విడుదల చేసి తమ ఆకాంక్షను చాటిచెప్పారు.
హైడ్రా సాధించిన అద్భుతమైన ఫలితాలే తమ ఈ మద్దతుకు ప్రధాన కారణమని సంక్షేమ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. గత రెండేళ్ల వ్యవధిలో కబ్జాదారుల బారిన పడకుండా సుమారు 3325 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా రక్షించిందని తెలిపారు. ఈ భూముల బహిరంగ మార్కెట్ విలువ దాదాపు రూ. 1.50 లక్షల కోట్లు ఉంటుందని ప్రశంసించారు. దీనికి తోడు రెండు విడతలలో మొత్తం 20 చెరువులను శాస్త్రీయంగా పునరుద్ధరించి, ఆయా పరిసర ప్రాంత ప్రజలకు వరద భయం లేకుండా చేయడాన్ని నగరవాసులు కళ్లారా చూశారని పేర్కొన్నారు.
గతంలో కేవలం 5 సెంటీమీటర్ల వర్షం పడితే చాలు అమీర్‌పేట, శ్రీనివాసనగర్, మధురానగర్ వంటి ప్రాంతాలు జలమయమై ఇళ్లల్లోకి నీరు చేరేదని స్థానికులు గుర్తుచేశారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని హైడ్రాను రంగంలోకి దించడంతో పరిస్థితులు పూర్తిగా మారాయన్నారు. వర్షపు నీటి కాల్వలు, నాలాల్లో ఉన్న అడ్డంకులను తొలగించి, నీరు వేగంగా ముందుకు సాగేలా పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకున్నారని కొనియాడారు.
హైడ్రా కేవలం ఒకే రకమైన చర్యలకు పరిమితం కాకుండా జీహెచ్‌ఎంసీ, జలమండలి, ఇరిగేషన్ వంటి కీలక శాఖలతో సమర్థవంతంగా సమన్వయం చేసుకుంటోందని ప్రజలు పేర్కొన్నారు. వివిధ శాఖల అధికారులను ఒకే తాటిపైకి తెచ్చి, కేవలం వారం రోజుల వ్యవధిలోనే క్లిష్టమైన వరద నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపించడం అభినందనీయమని చెప్పారు. ప్రభుత్వ వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో హైడ్రా నిరూపించిందన్నారు.
నగరంలో విలువైన ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకున్న కొందరు బడా కబ్జాదారులు, వారికి వెన్నుదన్నుగా నిలిచే రాజకీయనాయకులు తమ అక్రమ సంపాదనకు గండి పడటంతోనే ఓర్వలేకపోతున్నారని స్థానికులు ఆరోపించారు. తమ స్వార్థ ప్రయోజనాలు దెబ్బతినడంతోనే సోషల్ మీడియాలో హైడ్రాపై, ప్రభుత్వంపై బురద చల్లేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి దుష్ప్రచారాలను ప్రజలు నమ్మరని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి నగర ప్రజలంతా అండగా ఉంటారని స్పష్టం చేశారు.
హైడ్రా సమర్థవంతంగా పనిచేయడంలో కమిషనర్ ఏవీ రంగనాథ్ పాత్ర కీలకమని ర్యాలీలో పాల్గొన్న ప్రతినిధులు కొనియాడారు. ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా, ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేస్తున్న ఏవీ రంగనాథ్ నేతృత్వంలోనే ఈ వ్యవస్థ నిరంతరం కొనసాగాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరిస్తున్న అధికారులకు ప్రజాక్షేత్రంలో పూర్తి రక్షణ, మద్దతు ఉంటాయని నినాదాలు చేశారు.
ఇటీవల హైడ్రా కమిషనర్‌గా ఏవీ రంగనాథ్‌ను తొలగించాలంటూ తెలంగాణ హైకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో, వీధుల్లోకి వచ్చి ప్రజలు నిర్వహించిన ఈ సంఘీభావ ర్యాలీలు తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. న్యాయస్థానాలు, ప్రభుత్వం ప్రజల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని, నగర భవిష్యత్తు కోసం, చెరువుల సంరక్షణ కోసం హైడ్రా వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకుండా మరింత బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని హైదరాబాద్ ప్రజలు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశారు.
