- ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు పొన్నం కుటుంబం ఆదర్శం
- వ్యవసాయం, రైతుకు విలువ ఇవ్వడంలో పొన్నం సత్తయ్య స్ఫూర్తిదాయకం
- కొత్త తరానికి కుటుంబ విలువలు అందించాలి: శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
హైదరాబాద్, వెలుతురు, సెప్టెంబర్ 13:
ఆస్తులు తరతరాలకు అందుతాయని, కానీ కుటుంబ విలువలే తరాలను ఒక్కతాటిపై నిలుపుతాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కుటుంబ బంధాలు బలహీనపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేమ, ఆప్యాయత, పరస్పర సహకారంతో ఐక్యంగా కొనసాగుతున్న పొన్నం కుటుంబం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని పలువురు వక్తలు కొనియాడారు.
వ్యవసాయం, రైతు సంక్షేమం, మానవ సంబంధాలు, కుటుంబ విలువలకు జీవితాంతం ప్రాధాన్యత ఇచ్చిన పొన్నం సత్తయ్య గౌడ్ ఆశయాలను ఆయన కుటుంబ సభ్యులు కొనసాగిస్తున్నారని వారు ప్రశంసించారు.
పొన్నం సత్తయ్య గౌడ్ 16వ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారాలు–2026’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయం, సాహిత్యం, జానపద కళారంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి పురస్కారాలను ప్రదానం చేశారు.
వ్యవసాయమే గ్రామీణ జీవనానికి ఆధారం
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ సమాజంలో వ్యవసాయానికి, రైతుకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. వ్యవసాయానికి విలువనిస్తూ రైతు జీవితాన్ని గౌరవించిన వ్యక్తిగా పొన్నం సత్తయ్య నిలిచారని పేర్కొన్నారు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బలంగా ఉండేదని, కుటుంబంలో ఎవరికైనా కష్టం వస్తే మిగిలిన వారు అండగా నిలిచేవారని గుర్తుచేశారు. పెద్దలు తమ అనుభవాలను చిన్నవారికి పంచుకోవడం, చిన్నవారు తమ సమస్యలను పెద్దలతో పంచుకోవడం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గొప్పతనమన్నారు.
ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడంతో కుటుంబ బంధాలు బలహీనపడుతున్నాయని, దాని ప్రభావం సమాజంపైనా పడుతోందన్నారు. ఒంటరితనం, అసంతృప్తి, కుటుంబ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో మానవ సంబంధాలు, కుటుంబ విలువలను కొత్త తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
పొన్నం కుటుంబం విలువలకు ప్రతిరూపం
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ పొన్నం కుటుంబంతో తనకు ఆత్మీయ అనుబంధం ఉందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రేమ, ఆప్యాయతలతో అందరినీ కలుపుకుపోయే నాయకుడని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కార్యకర్తలు, నాయకులను సోదరభావంతో కలుపుకుపోతున్నారని అన్నారు. పొన్నం సత్తయ్య చూపిన మార్గం, కుటుంబ విలువలు నేటికీ ఆ కుటుంబంలో కొనసాగుతున్నాయని, ముగ్గురు అన్నదమ్ములు ఐక్యంగా, ప్రేమగా ఉండటం సంతోషకరమైన విషయమన్నారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, పరస్పర సహకారం సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు.
పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు పేదలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. సామాజికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్య, శిక్షణ, అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని పేర్కొన్నారు.
‘జై తెలంగాణ’ నినాదం నుంచి మంత్రి స్థాయికి
మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో పొన్నం ప్రభాకర్ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. యువజన కాంగ్రెస్‌లో పోరాట స్ఫూర్తిని నింపుతూ ఎక్కడ ఉద్యమం జరిగినా ముందుండేవారని అన్నారు. పార్లమెంట్‌లోనూ బలంగా ‘జై తెలంగాణ’ నినాదాన్ని వినిపించారని పేర్కొన్నారు. ఆ పోరాట స్ఫూర్తి, ప్రజల పట్ల నిబద్ధతలో పొన్నం సత్తయ్య విలువల ప్రభావం కనిపిస్తోందన్నారు.
రైతుకు దక్కిన గౌరవంగా పురస్కారాన్ని భావిస్తున్నా
వ్యవసాయ పురస్కార గ్రహీత, వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి మాట్లాడుతూ తనకు లభించిన పురస్కారం వ్యక్తిగత గౌరవం కాదని, తెలంగాణ రైతులకు దక్కిన గౌరవమన్నారు. తాను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చానని, చిన్ననాటి నుంచే వ్యవసాయంతో అనుబంధం ఉందన్నారు. రైతుల అప్పులు, ప్రకృతి వైపరీత్యాలు, కౌలు రైతులు, చిన్న రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ప్రస్తావించిన ఆయన, రైతులు సంఘటితంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రైతు సంఘాలు, ఎఫ్‌పీవోల ద్వారా తమ హక్కులను కాపాడుకోవాలని సూచించారు.
ఐదో ఏడాది నుంచి వ్యవసాయ రంగానికి పురస్కారం
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తన తండ్రి పొన్నం సత్తయ్య జ్ఞాపకార్థం ప్రతి ఏడాది వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న వారిని గుర్తించి సత్కరిస్తున్నామని తెలిపారు. గత ఏడాది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచన మేరకు ఈ ఏడాది నుంచి వ్యవసాయ రంగాన్ని కూడా పురస్కారాల్లో చేర్చామని చెప్పారు.
వ్యవసాయ రంగంలో రైతుల సమస్యల పరిష్కారం, వ్యవసాయ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎం. కోదండరెడ్డిని ఈ ఏడాది ఎంపిక చేసినట్లు తెలిపారు. సాహిత్య రంగంలో వెలిచాల కొండల్‌రావు, జానపద కళారంగంలో గొట్టె కనకవ్వలను జ్ఞాపికతో పాటు రూ.50 వేల నగదు పురస్కారాన్ని అందజేశారు.
తల్లిదండ్రులు ఇచ్చేది ఆస్తి కాదు.. విలువలు
తల్లిదండ్రులు పెద్దగా చదువుకోకపోయినా తమకు విద్య, క్రమశిక్షణ, విలువలు, సామాజిక బాధ్యతలను నేర్పించారని పొన్నం ప్రభాకర్ తెలిపారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తమకు వ్యవసాయం విలువ, రైతు కష్టం తెలుసునన్నారు. తండ్రి పేరుతో ప్రతి ఏడాది కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆయన ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు.
తండ్రి కష్టం.. పిల్లల విజయాలుగా
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పొన్నం సత్తయ్య తన జీవితాన్ని వ్యవసాయంతో పాటు పిల్లల భవిష్యత్తు కోసం అంకితం చేశారని అన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యవసాయ పనులు చేస్తూనే పిల్లలను ఉన్నతంగా చదివించాలనే దూరదృష్టితో వ్యవహరించారని తెలిపారు. ఆయన ముగ్గురు కుమారులు వివిధ రంగాల్లో రాణించడం తండ్రి కష్టం, క్రమశిక్షణ, విలువలకు ప్రతిఫలమని పేర్కొన్నారు.
ఆస్తులకంటే విలువలే గొప్ప వారసత్వం
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే గొప్ప వారసత్వం ఆస్తులు కాదని, మంచి ఆలోచనలు, ధైర్యం, విలువలు, కష్టాలను ఎదుర్కొనే శక్తి అని అన్నారు. కుటుంబం అందించే మానసిక బలం కష్టకాలంలో ఎంతో అవసరమని చెప్పారు. కుటుంబాల్లో ప్రేమ, గౌరవం, పరస్పర సహకారం పెరిగితే సమాజంలోనూ శాంతి, సామరస్యం పెరుగుతాయని అన్నారు.
ప్రతిభకు గుర్తింపు.. సమాజానికి స్ఫూర్తి
ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులతో పాటు సంస్కారం, సంప్రదాయం, సానుభూతి, మానవత్వాన్ని అందించాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయని, కుటుంబ కలహాలు, హింస పెరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవం, బాధ్యత మరింత అవసరమని పేర్కొన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ పొన్నం సత్తయ్య మానవ విలువలు, మానవ సంబంధాలు, కుటుంబ విలువలకు ప్రతీకగా నిలిచారని అన్నారు. ఆయన ఆలోచనలు, ఆశయాలను తరతరాలకు అందించాలనే ఉద్దేశంతో పురస్కారాలను కొనసాగిస్తున్నామని తెలిపారు.
సాహిత్య పురస్కార గ్రహీత వెలిచాల కొండల్‌రావు మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యం, అభిప్రాయాలు, ఆలోచనలకు ప్రజాస్వామ్యంలో ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. భిన్నమైన భావాలు, సిద్ధాంతాలకు చెందిన వ్యక్తులు ఒకే వేదికపై కలవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకరయ్య, నవీన్ యాదవ్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ప్రొఫెసర్ హరగోపాల్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బాలమాయాదేవి, అధికారులు, ప్రజాప్రతినిధులు, పొన్నం కుటుంబ సభ్యులు, అభిమానులు, సాహిత్య, కళా, వ్యవసాయ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.



