- ప్రతిపక్ష హక్కుల పరిరక్షణ, రాజకీయ వేధింపులపై సమగ్ర విచారణకు విజ్ఞప్తి
- ప్రొఫెషనల్ థ్రెట్ అసెస్‌మెంట్ ఆధారంగా కేసీఆర్‌కు భద్రత కల్పించాలని డిమాండ్
హైదరాబాద్, వెలుతురు, సెప్టెంబర్ 10
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల హక్కులు, ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) మాజీ చైర్మన్, ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ఆరోపించారు. ఈ అంశాల్లో జోక్యం చేసుకుని రాజ్యాంగబద్ధ పాలన, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని కోరుతూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన లేఖ రాశారు.
పోలీసు, పరిపాలనా వ్యవస్థలను ప్రతిపక్ష నేతలపై రాజకీయ కక్ష సాధింపులకు ఉపయోగిస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరపాలని ఆయన రాష్ట్రపతిని కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై జరిగినట్లు పేర్కొంటున్న దాడులు, అరెస్టులు, నిర్బంధాలు తదితర ఘటనలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజలచే ఎన్నికైన ప్రజాప్రతినిధుల పట్ల గౌరవం పాటిస్తూ, చట్టబద్ధమైన విధానాలను అనుసరించేలా సంబంధిత వ్యవస్థలకు తగిన మార్గదర్శకత్వం అవసరమని అనిల్ కూర్మాచలం పేర్కొన్నారు.
మహిళా ప్రజాప్రతినిధులపై దురుసు ప్రవర్తనపై విచారణకు విజ్ఞప్తి
బీఆర్ఎస్ మహిళా నేతలు, మాజీ మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలపై జరిగినట్లు చెబుతున్న దౌర్జన్యాలు, దురుసు ప్రవర్తనపై కూడా నిష్పాక్షిక విచారణ జరపాలని ఆయన కోరారు. మహిళా ప్రజాప్రతినిధులు ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రజాస్వామ్య కార్యక్రమాల్లో పాల్గొనే స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సస్పెన్షన్లను సమీక్షించాలి
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సస్పెన్షన్లకు దారితీసిన పరిస్థితులను కూడా పరిశీలించాలని రాష్ట్రపతిని అనిల్ కూర్మాచలం కోరారు. శాసనసభ, శాసనమండలి నిబంధనలు, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే సస్పెన్షన్లు జరిగాయా అనే అంశంపై సమీక్ష అవసరమని పేర్కొన్నారు.
ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యం బలపడదని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్షానికి రాజ్యాంగబద్ధంగా లభించిన హక్కు అని ఆయన అన్నారు. రాజకీయ విభేదాలను చర్చలు, శాసన ప్రక్రియలు, ఎన్నికలు, న్యాయపరమైన మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
కేసీఆర్ భద్రతపై ప్రత్యేక ఆందోళన
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భద్రతపై కూడా అనిల్ కూర్మాచలం తన లేఖలో ప్రత్యేక ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రాణ భద్రతకు ముప్పు ఉందన్న అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి వంటి ప్రముఖ ప్రజా నాయకుడి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని పేర్కొన్నారు.
కేసీఆర్ ఫార్మ్‌హౌస్‌పై దాడికి ప్రయత్నం జరిగినట్లు చెబుతున్న అంశం, ఆయనకు వచ్చినట్లు పేర్కొంటున్న బెదిరింపుల తీవ్రత, విశ్వసనీయతపై తక్షణమే సమగ్ర అంచనా వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బెదిరింపుల మూలాలను నిష్పాక్షికంగా దర్యాప్తు చేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
రాజకీయాలకు అతీతంగా వాస్తవ భద్రతా ముప్పును అంచనా వేసే ప్రొఫెషనల్ థ్రెట్ అసెస్‌మెంట్ ఆధారంగా కేసీఆర్‌కు తగిన భద్రత కల్పించాలని రాష్ట్రపతిని అనిల్ కూర్మాచలం కోరారు.
రాజ్యాంగ సంస్థలు స్వతంత్రంగా పనిచేయాలి
తెలంగాణలో రాజ్యాంగబద్ధ పాలన, చట్టబద్ధత, ప్రజాస్వామ్య హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు ఎలాంటి భయాందోళనలు లేకుండా తమ బాధ్యతలను నిర్వర్తించే పరిస్థితులు కల్పించాలని కోరారు.
రాష్ట్రంలో జరుగుతున్నట్లు పేర్కొంటున్న పోలీసు చర్యలు, దాడులు, రాజకీయ వేధింపులపై స్వతంత్రంగా పరిశీలన జరపాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడంతో పాటు, రాజ్యాంగ సంస్థలు రాజకీయ వివక్షకు అతీతంగా స్వతంత్రంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణలో ప్రజాస్వామ్యం, న్యాయపాలన, రాజకీయ స్వేచ్ఛ, ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడేందుకు రాష్ట్రపతి తగిన చర్యలు తీసుకోవాలని అనిల్ కూర్మాచలం విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజా భద్రత, న్యాయం కోసం రాష్ట్రపతి తగిన జోక్యం చేసుకుంటారన్న విశ్వాసం తనకు ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
