- కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ఆదేశం
- దేశంలో ప్రతి రహదారిపై పాదచారులకు ప్రత్యేక మార్గం
- రహదారులపై పాదచారుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం
- ఆక్రమణలకు గురికాకుండా స్పష్టమైన గుర్తులు
- వాహనాల భయం లేకుండా నడిచేలా ఏర్పాట్లు చేయాలని సూచన
- జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ, వెలుతురు, ఆగష్టు 03:
దేశంలోని ప్రతీ రహదారిపై కాలినడకన వెళ్లే పాదచారులు ఎలాంటి ప్రమాదాలు, భయం లేకుండా సురక్షితంగా నడిచేందుకు వీలుగా ప్రత్యేక స్థలాన్ని తక్షణమే కేటాయించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాదచారుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన మార్గాలు ఎలాంటి ఆక్రమణలకు గురికాకుండా చూడాలని, అలాగే సాధారణ వాహనాల రాకపోకలు సాగే రహదారి నుంచి వీటిని స్పష్టంగా వేరు చేసి ప్రజలకు కనిపించేలా గుర్తించాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న రహదారి ప్రమాదాలు, పాదచారుల భద్రతపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వం తరఫున కోర్టులో హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్‌కు ధర్మాసనం ఈ విషయమై పలు మార్గదర్శకాలను, సూచనలను అందించింది.
దేశంలో ఎక్కడ రహదారి నిర్మించినా లేదా పునర్నిర్మించినా, అక్కడ పాదచారుల కోసం కచ్చితంగా ప్రత్యేక మార్గం ఉండాల్సిందేనని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ ఏర్పాటు కోసం ప్రభుత్వం భారీగా రూ. కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదని అభిప్రాయపడింది. రోడ్డు పక్కన కనీసం తాడు లేదా ఇతర రంగులు, తాత్కాలిక గుర్తులు వేసి అయినా సరే పాదచారుల మార్గాన్ని స్పష్టంగా వేరు చేసి చూపించాలని కోర్టు సూచించింది. ఆ కేటాయించిన స్థలంలో ఎలాంటి చిరువ్యాపారాలు, వాహనాల పార్కింగ్ లేదా ఇతర ఆక్రమణలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రతీ పౌరుడు తన కోసం కేటాయించిన ప్రత్యేక మార్గంలో వేగంగా వచ్చే వాహనాల భయం లేకుండా చాలా స్వేచ్ఛగా నడిచేలా వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈ కీలక అంశంపై సంబంధిత అన్ని మంత్రిత్వ శాఖలు, అధికారులకు తక్షణమే అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీటికి సంబంధించి తీసుకున్న చర్యలతో సమగ్ర నివేదిక సమర్పించడానికి కేంద్రానికి రెండు వారాల సమయం ఇస్తూ, తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.ఇదివరకు జూన్ 19న కూడా సుప్రీంకోర్టు ఇదే అంశంపై విచారణ జరుపుతూ ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ప్రత్యేకంగా గుర్తించిన ఫుట్‌పాత్‌పై సురక్షితంగా నడవడం అనేది ఈ దేశంలో జన్మించిన ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని తేల్చిచెప్పింది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(డి) ప్రకారం పౌరులకు లభించిన దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా సంచరించే ప్రాథమిక హక్కుతో పాటు, ఆర్టికల్ 21 ద్వారా ప్రాథమికంగా లభించిన గౌరవప్రదమైన జీవించే హక్కులో కూడా పాదచారుల భద్రత ఒక అంతర్భాగమని సుప్రీంకోర్టు తన తీర్పులో పొందుపరిచింది.అంతేకాకుండా, ప్రత్యేకంగా పాదచారుల కోసం కేటాయించి గుర్తించిన రహదారి మార్గాలలో వేగంగా వెళ్లే మోటారు వాహనాల కంటే కాలినడకన వెళ్లే పాదచారుల హక్కుకే మొదటి ప్రాధాన్యం ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం క్లియర్ కట్‌గా స్పష్టం చేసింది.
కేంద్రానికి ఇచ్చిన రెండు వారాల గడువు తదుపరి చర్యలపై మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన ఈ తాజా ఆదేశాలతో ఇకపై దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రంలోనూ పాదచారుల భద్రత, ఫుట్‌పాత్‌ల పరిరక్షణ, రహదారుల సరిహద్దుల గుర్తింపుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందని చట్ట నిపుణులు అభిప్రాయపడుతున్నారు.దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో విస్తరిస్తున్న రహదారుల కారణంగా రోజురోజుకూ పాదచారులకు స్థలం కరువై ప్రమాదాల బారిన పడుతున్న తరుణంలో, సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రక ఆదేశాలు సామాన్య పౌరుడికి ఎంతగానో ఊరటనిచ్చే అంశంగా నిలిచాయి.
