సెప్టెంబర్ 17 చరిత్రను గుర్తు చేసే రోజే కాదు.. మన బాధ్యతను గుర్తు చేసే రోజు: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్,వెలుతురు, సెప్టెంబర్ 17:
ప్రజల మాటకు విలువ ఇవ్వడం, వారి సమస్యలకు పరిష్కారం చూపడం, హక్కులను కాపాడడం, ప్రభుత్వ వనరులు అందరికీ చేరేలా చూడటమే ప్రజా పాలన అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17 సందర్భంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు.
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. తెలంగాణ ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన యోధులందరికీ నివాళులర్పించారు. సమ్మక్క–సారలమ్మల పోరాటం నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు అన్యాయాన్ని ఎదిరించడం తెలంగాణ గడ్డ స్వభావమన్నారు.
1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమైన ఘటన రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు మార్గం తెరిచిన చారిత్రక సందర్భమని పేర్కొన్నారు. ఆ చరిత్ర ప్రజలను కేంద్రంగా చేసుకుని పాలన సాగించాలనే సందేశాన్ని ఇస్తోందన్నారు.
రైతు సంక్షేమానికి పెద్దపీట
రైతు పక్షపాత ప్రభుత్వంగా రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేశామని సీఎం తెలిపారు. రూ.20,616 కోట్లు విడుదల చేసి 25.35 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం కల్పించామని చెప్పారు. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేశామని, సన్నాలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందించామని తెలిపారు.
వ్యవసాయం, రైతు సంక్షేమానికి 32 నెలల్లో దాదాపు రూ.1.72 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. భూ భారతి చట్టంతో భూ పరిపాలనలో సంస్కరణలు చేపట్టామని, భూధార్, ఏఐ ఆధారిత భూమిత్ర సేవలను ప్రారంభించామని వెల్లడించారు.
మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యం
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, గృహజ్యోతి కింద 53 లక్షలకు పైగా కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు.
స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ, వడ్డీ రాయితీలు కల్పించడంతో పాటు మహిళా మార్ట్‌లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ అద్దె బస్సుల ద్వారా మహిళల ఆదాయాన్ని పెంచుతున్నామని చెప్పారు.
సంక్షేమానికి ప్రాధాన్యం
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 3.42 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నామని, 15 లక్షలకు పైగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశామని సీఎం తెలిపారు. 43 లక్షలకు పైగా మందికి సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల తొలి దశలో రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, రెండో దశలో మరో 2.50 లక్షల ఇళ్లకు అనుమతి ఇచ్చామని తెలిపారు.
సామాజిక న్యాయమే ప్రజా పాలనకు పునాది
సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అంశాలపై కుల సర్వేను శాస్త్రీయంగా నిర్వహించామని సీఎం తెలిపారు. సర్వే గణాంకాల ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభ ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపామని చెప్పారు. సామాజిక న్యాయం తమకు నినాదం కాదని, వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకురావడం, అవకాశాలు తక్కువగా దక్కిన వారికి మరిన్ని అవకాశాలు కల్పించడమే లక్ష్యమని అన్నారు.
విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం
ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామని సీఎం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభించామని, విద్యార్థులకు అల్పాహారం, పాలు అందించేందుకు రూ.927 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 5.19 లక్షల మందికి రూ.2,526 కోట్ల సాయం అందించామని వెల్లడించారు. గోషామహల్‌లో రూ.2,700 కోట్లతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం ప్రారంభమైందని తెలిపారు.
యువతకు ఉద్యోగాలు, నైపుణ్యాలు
72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా పూర్తి చేశామని సీఎం అన్నారు. ఏఐ కారణంగా ఉద్యోగాల స్వరూపం మారుతున్న నేపథ్యంలో నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేశామని, పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నామని చెప్పారు.
మౌలిక వసతుల విస్తరణ
మెట్రో రెండో దశలో 122.9 కిలోమీటర్ల విస్తరణకు రూ.38,595 కోట్లతో ప్రతిపాదనలు పంపామని సీఎం తెలిపారు. ఆదిలాబాద్, మామునూరు విమానాశ్రయాలకు అనుమతులు సాధించామని చెప్పారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు ద్వారా 55 కిలోమీటర్ల పరిధిలో మూసీని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఆహార కల్తీ నియంత్రణకు టీజీ సేఫ్, మాదకద్రవ్యాల నియంత్రణకు ఈగల్ వ్యవస్థను బలోపేతం చేశామని వెల్లడించారు.
2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం
తెలంగాణ రైజింగ్ విజన్ 2047లో భాగంగా 2047 నాటికి రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం తెలిపారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచే దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. దాదాపు 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని దేశంలో తొలి నెట్-జీరో స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఏఐ సిటీ, హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, లైఫ్ సైన్సెస్ హబ్, ఈవీ పార్క్ వంటి ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
చరిత్రను మరిచిపోం.. చరిత్ర దగ్గరే ఆగిపోం
సెప్టెంబర్ 17 గతాన్ని గుర్తు చేసే రోజు మాత్రమే కాదని, మన బాధ్యతను గుర్తు చేసే రోజు అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రైతుకు భరోసా, మహిళలకు ఆర్థిక స్వావలంబన, అట్టడుగు వర్గాలకు న్యాయం, పేద పిల్లలకు నాణ్యమైన విద్య, వైద్యం, యువతకు ప్రపంచస్థాయి అవకాశాలు, రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి అభివృద్ధి చేరేలా కృషి చేయడమే ప్రజా పాలన లక్ష్యమని చెప్పారు. చరిత్రను మరిచిపోం.. చరిత్ర దగ్గరే ఆగిపోం. ఆ పోరాట స్ఫూర్తితో ఆధునిక తెలంగాణను నిర్మించుకుందాం. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణను ప్రపంచం గర్వించే రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం అని ముఖ్యమంత్రి అన్నారు.
