22ఏ పై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు: పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి

  • అబ‌ద్దాల‌తో ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తున్నారు
  • ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు
  • 22ఏ ద‌ర‌ఖాస్తులు ఫాస్ట్‌ట్రాక్‌.లో ప‌రిష్కరించాం
  • 98 శాతం రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి
  • నకిలీ జీఓలు.. బోగస్ మెమోలు.. ఫేక్ సర్టిఫికెట్లతో భూదందాలు
  • అక్రమార్కులపై క్రిమినల్ కేసులు
  • ప్రభుత్వ భూమిని ప్రైవేట్‌గా చూపిస్తే సహించం
  • యుఎల్‌సీపై త్వరలో విధాన నిర్ణయం
  • ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కోరితే CS-7, CS-14 భూ వ్యవహారంపై సెట్ దర్యాప్తు
  • రిజిస్ట్రేష‌న్ స్లాట్ ర‌ద్దుచేసుకున్న వారి సొమ్మును వారం రోజుల్లో చెల్లింపు

హైదరాబాద్, వెలుతురు, ఆగష్టు 24:

రాష్ట్రంలో 22ఏలో లక్షలాది ఎక‌రాలు చేర్చారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, 2023 డిసెంబర్ 7 నాటికి ఉన్న పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి, ఏ కేటగిరీ భూములు ఎంత మేర నిషేధిత జాబితాలో ఉన్నాయో పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచుతున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వెల్ల‌డించారు.

22ఎ పేరిట ప్ర‌తిప‌క్షాలు అన‌వ‌స‌ర రాద్దాంతాన్ని సృష్టిస్తూ ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేస్తున్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు. 22ఎ పేరిట ఇంత‌వ‌ర‌కు వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల్లో 98 శాతం రిజిస్ట్రేష‌న్లు పూర్త‌య్యాయ‌ని దీనిపై దుష్ప్ర‌చారాల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు. ఇందిర‌మ్మ ప్ర‌జా ప్ర‌భుత్వం అధికారం చేప‌ట్టిన నాటికి నిషేధిత జాబితాలో ఉన్న ఫారెస్ట్, వక్ఫ్, దేవాదాయ, అసైన్డ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాల మేరకు నిషేధిత జాబితాలో ఉన్న భూములు, ప్రైవేట్ భూములు తదితర వివరాలను కేటగిరీల వారీగా మొత్తం వివ‌రాల‌ను మీడియాకు విడుద‌ల చేశారు.

సోమ‌వారం నాడు స‌చివాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయన మాట్లాడుతూ లక్షలాది ఎకరాలు 22ఎలో పెట్టారని ప్ర‌తిప‌క్షాలు ఆరోపణలు చేయడం కాదు.. ఎంత ఉంది, ఎందుకు ఉంది, ఎవరి భూమి, ఏ కారణంతో నిషేధిత జాబితాలో పెట్టార‌నే ప్రతి అంశాన్ని రికార్డులతో చెబుతాం. వాస్తవాలు ప్రజల ముందుకు వస్తే ఎవరు నిజం చెబుతున్నారో ప్రజలే నిర్ణయిస్తారు అన్నారు. ప్రభుత్వ భూములు, ప్రజా ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులు లేదా రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు మళ్లించకుండా కాపాడటం 22ఏ ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు.

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని రెండు రెవెన్యూ గ్రామాల్లో 122 ఎకరాలు, మరోచోట 400కు పైగా ఎకరాలు కలిపి సుమారు 522 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించిన వ్యవహారాలను మంత్రి ఉదాహరణగా ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు ఈ భూముల వ్యవహారం అప్పట్లో మీడియాలో కూడా చర్చకు వచ్చిందని, ప్రభుత్వ భూములను భారీ విస్తీర్ణాల్లో ప్రైవేట్ వ్య‌క్తుల‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించారు. ఇలాంటి భూముల‌ను నిషేధిత జాబితాలో పెట్ట‌డం త‌ప్పా? ఎందుకు పెట్ట‌కూడ‌ద‌ని ప్ర‌శ్నించారు.

సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డి ప‌ల్లి రెవెన్యూ గ్రామంలో 1958కు ముందు అసైన్‌మెంట్ జరిగినట్లు చూపిస్తూ, సరైన ప్రభుత్వ రికార్డులు లేకుండానే భూములపై హక్కులు సృష్టించి దార‌ద‌త్తం చేశారు.

హైద‌రాబాద్ జూబ్లీ హిల్స్‌లో సర్వే నంబర్ 403కు సంబంధించి సుమారు 1,280 ఎకరాల విస్తీర్ణం ఉండగా, అందులో కేవలం రెండు ప్లాట్లు మాత్రమే నిషేధిత జాబితాలో ఉన్నాయని మంత్రి తెలిపారు.గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు రికార్డులు అప్‌లోడ్ చేసే సమయంలో మొత్తం సర్వే నంబర్‌ను పేర్కొనడం వల్ల ముఖ్య‌మంత్రి గారి నివాసంతో పాటు త‌న నివాసం కూడా పీఓబీలో చేర్చార‌ని దానిని గుర్తించి వెంట‌నే స‌రిచేశామ‌ని తెలిపారు.

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో సర్వే నంబర్ 172 ప్రభుత్వ భూమి, 173 ప్రైవేట్ భూమి అని, 173 పేరుతో అనుమతులు తీసుకుని 172 ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టిన ఉదాహరణను మంత్రి వివరించారు.“ప్రైవేట్ సర్వే నంబర్ పేరుతో అనుమతులు తీసుకుని ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేస్తే.. ఆ ప్రభుత్వ భూమిని 22ఏలో పెట్టకూడదా? 173లో కాదు, 172 ప్రభుత్వ భూమిలో పెట్టాం. ప్రభుత్వ భూమిని కాపాడటం మా బాధ్యత.” అని వివ‌రించారు.

మేడ్చల్ జిల్లా పర్వతాపూర్ ప్రాంతంలో ప్రధాన రెవెన్యూ గ్రామం, దానికి అనుబంధ హ్యామ్లెట్‌కు ఒకే తరహా సర్వే నంబర్లు కేటాయించడం వల్ల భూ వివాదాలు తలెత్తాయని మంత్రి చెప్పారు.సర్వే నంబర్లను సక్రమంగా పునర్వ్యవస్థీకరించి, సమగ్ర సర్వే ద్వారా ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు.

మహేశ్వరం మండలంలోని 22 ఎకరాల సర్వే నంబర్‌లో రెండు ఎకరాలను భూదాన్ భూమి ఉంటే మొత్తం 22 ఎకరాలకు పాస్‌బుక్ జారీ కావడం, భూదానం చేసిన రెండు ఎకరాలను ప్రత్యేకంగా గుర్తించడంలో సమస్య ఏర్పడ‌డంతో మొత్తం 22 ఎక‌రాల‌ను పీఓబీలో పెట్ట‌డం జ‌రిగింద‌న్నారు.

భూదాన్, అసైన్డ్, ప్రభుత్వ భూముల విషయంలో రికార్డులను కేసుల వారీగా పరిశీలించి, వాస్తవ హక్కుదారులకు న్యాయం చేస్తామని చెప్పారు. ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు నకిలీ జీఓలు, మెమోలు, అధికారుల సంతకాలతో బోగస్ పత్రాలు సృష్టిస్తున్న వ్యవహారాలను గుర్తించామని ఆమేర‌కు క్రిమిన‌ల్ కేసుల న‌మోదుకు ఆదేశాలిస్తున్నామ‌న్నారు.

మేడ్చల్ జిల్లాలో 22-04-2026 తేదీతో జిల్లా కలెక్టర్ సంతకం చేసినట్లు చూపిస్తూ ఒక నకిలీ మెమోను, మరోచోట 02-06-2026 తేదీతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పేరుతో బోగస్ సర్టిఫికెట్‌ను సృష్టించి రిజిస్ట్రేషన్ కోరిన వ్యవహారాలను గుర్తించామని చెప్పారు.
సంబంధిత వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు.

రాష్ట్రంలో పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం ( అర్బ‌న్ ల్యాండ్ సీలింగ్ – యుఎల్‌సి) కి సంబంధించి కొద్దిరోజుల్లో ప్ర‌భుత్వం విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని మంత్రిగారు వెల్ల‌డించారు. గత ప్రభుత్వ హయాంలో CS-7, CS-14కు సంబంధించి 2017లో అప్ప‌టి బీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి సంబంధించిన ప‌త్రిక ఎండి ఒక భూస్వామి నుంచి ఎస్ క్లాస్ బెంజి కారు తీసుకొని 5 డాక్యుమెంట్ల ద్వారా 811 ఎక‌రాల భూమిని రిజిస్ట్రేష‌న్ చేయించుకున్న అంశంపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కోరితే సెట్ ద‌ర్యాప్తున‌కు ఆదేశిస్తామ‌ని చెప్పారు.

రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్, మేడ్చల్–మల్కాజిగిరి ప్రాంతాల్లో యుఎల్‌సి క్లియరెన్స్‌కు సంబంధించిన సమస్యలను మంత్రి వివరించారు.యుఎల్‌సి క్లియర్ చేసుకున్న భూములకు సంబంధించిన జీఓలు, ఉత్తర్వులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి సమస్యలను పరిష్కరిస్తున్నామని, యుఎల్‌సికి దరఖాస్తు చేయని లేదా క్లియరెన్స్ పొందని భూములు నిషేధిత జాబితాలో ఉండటం సహజమేనని చెప్పారు.యుఎల్‌సి క్లియర్ చేసుకున్న వారికి ఇబ్బంది లేదు. అవసరమైన పత్రాలు అందిస్తే ప్రభుత్వం పరిశీలించి క్లియర్ చేస్తుంది. కానీ యుఎల్‌సి కూడా చేయించుకోకుండా ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములుగా చూపిస్తూ ప్రచారం చేయడం సరికాదని చెప్పారు.

22ఏ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌కు ఇప్పటివరకు 1,162 కాల్స్ వచ్చాయని మంత్రి తెలిపారు. రిపీటెడ్, ఓవర్‌ల్యాప్ కాల్స్ తొలగించిన తర్వాత 980 ప్రత్యేక ఫిర్యాదులు ఉన్నాయని చెప్పారు. వీటిలో 547 వ్యవసాయ భూములు, 433 వ్యవసాయేతర భూములకు సంబంధించినవని తెలిపారు.రంగారెడ్డి నుంచి 258, మేడ్చల్ నుంచి 149, సంగారెడ్డి నుంచి 82, కామారెడ్డి నుంచి 44, యాదాద్రి భువనగిరి నుంచి 40, సిద్దిపేట నుంచి 35 కాల్స్ వచ్చినట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 22ఎపై కొన్ని ప‌త్రిక‌ల్లో వ‌స్తున్న‌ట్లుగా తీవ్ర స‌మ‌స్య లేద‌ని అన్నారు.

ఇప్పటికే రిలాక్సేషన్ పొందిన 22ఏ కేసుల్లో సుమారు 98 శాతం స్లాట్లకు రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు.సుమారు 300కు పైగా స్లాట్లలో దేవాదాయ, భూదాన్ తదితర కారణాలతో రిజిస్ట్రేషన్‌కు వీలు లేని 12–13 కేసులను మాత్రమే తిరస్కరించినట్లు చెప్పారు.రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయిన వారికి ఈ వారాంతంలోపు ఆ మొత్తాన్ని తిరిగి వారి ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. 22ఏకు సంబంధించిన నిజమైన సమస్యలను 24 గంటల్లో, అవసరమైన సందర్భాల్లో గరిష్ఠంగా 36 గంటల్లో పరిష్కరించేలా ఫాస్ట్‌ట్రాక్ విధానం అమలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

ప్రజలను భయపెట్టడం మా ప్రభుత్వ విధానం కాదు.. ప్రజలకు భరోసా కల్పించడం మా బాధ్యత. ప్రభుత్వ భూములను కాపాడటం ఎంత ముఖ్యమో, న్యాయబద్ధమైన ప్రైవేట్ ఆస్తులకు రక్షణ కల్పించడం కూడా అంతే ముఖ్యం” అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

ఈ స‌మావేశంలో రెవెన్యూ కార్య‌ద‌ర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్స్ ఐజి రాజీవ్ గాంధీ హ‌నుమంతు, హైద‌రాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి క‌లెక్ట‌ర్లు, జిల్లా రిజిస్ట్రార్లు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.