హైదరాబాద్, వెలుతురు, ఆగష్టు 22:
జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి నైపుణ్యాల పెంపు, పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు తెలంగాణ మీడియా అకాడమీ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని దేశంలోని పలు రాష్ట్రాలతో ఏర్పడ్డ ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ ప్రతినిధులు ప్రశంసించారు. ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ ప్రతినిధి బృందం శనివారం మధ్యాహ్నం తెలంగాణ మీడియా అకాడమీ భవనాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా అకాడమీ చైర్మన్ శ్రీ కే. శ్రీనివాస్ రెడ్డి ప్రతినిధులకు అకాడమీ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు, జర్నలిస్టుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. అకాడమీ కార్యదర్శి నాగుళ్లపల్లి వెంకటేశ్వరరావు ప్రతినిధి బృందానికి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అక్రిడిటేషన్ సేవలు, విధి నిర్వహణలో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అందిస్తున్న రూ.1 లక్ష ఆర్థిక సహాయం, వారి పిల్లలకు అందిస్తున్న ట్యూషన్ ఫీజు సహాయం, అలాగే జర్నలిస్టు కుటుంబాలకు అందిస్తున్న ఇతర సంక్షేమ కార్యక్రమాలను ప్రతినిధులకు వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్ కార్డులు అందజేస్తుండటం పట్ల ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ ప్రతినిధులందరూ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 23,000 మందికి పైగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ సౌకర్యం కల్పించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తూ, జర్నలిస్టుల వృత్తిపరమైన గుర్తింపు, సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు.
రాష్ట్రంలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎంపీలు, అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ ప్రతినిధులు ఒక వినతిపత్రాన్ని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ కె. శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. జర్నలిస్టుల సమస్యలను పరిశీలించి, వాటిని సంబంధిత ఎంపీలు అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
అదేవిధంగా జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు, వర్క్షాపులు, అవగాహనా కార్యక్రమాల గురించి వివరించారు. శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనే జర్నలిస్టులకు ఉపయోగపడేలా అకాడమీ ప్రచురిస్తున్న మోనోగ్రాఫ్లు, పుస్తకాలు అందిస్తున్న విధానాన్ని కూడా ప్రతినిధులు పరిశీలించారు.
మీడియా అకాడమీ కోసం నిర్మించిన ఆధునిక సౌకర్యాలతో కూడిన ఐదు అంతస్తుల భవనం, శిక్షణా తరగతులు, గ్రంథాలయం, కంప్యూటర్ సౌకర్యాలు, సమావేశ మందిరం, 250 మంది సామర్థ్యం కలిగిన సెంట్రల్ ఏసీ ఆడిటోరియం తదితర సౌకర్యాలను ప్రతినిధి బృందం సందర్శించింది. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇంతటి సమగ్ర మౌలిక వసతులతో అకాడమీ పనిచేయడం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
కొత్తగా ఏర్పడిన ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ కేవలం మరో సంస్థగా కాకుండా దేశవ్యాప్తంగా జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, వృత్తి ప్రమాణాలు, పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు బలమైన వేదికగా ఎదగాలని ప్రతినిధులు ఆకాంక్షించారు. జర్నలిస్టుల ఐక్యతను బలోపేతం చేయడంతో పాటు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఫెడరేషన్ మరింత క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు.
మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తాయని, ముఖ్యంగా జర్నలిస్టుల సంక్షేమం, శిక్షణ రంగాల్లో అకాడమీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఫెడరేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు ప్రతినిధి బృందానికి అకాడమీ కార్యకలాపాలు, సంక్షేమ కార్యక్రమాలపై వివరాలు అందించారు.
ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్ కు చెందిన నీలేష్ కాంతాహా, హారీష్ పగిడే, సంజయ్ మహతా (మధ్యప్రదేశ్), సోనాలి యాదవ్, దీపక్ మహేశ్వరీ, ఉదిత్ తండ్, ఉమాలీ తండ్, లక్షణ్ ఫండ్, యాష్ వర్థన్ సింగ్, రచనా జోషి, ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ ప్రెసిడెంట్ గౌతమ్ పహాని, డా. స్నేహాశిస్ సూర్, జనరల్ సెక్రటరీ సౌరభ్ దుగ్గల్, మెంబర్ అనిల్ సింగ్, సెక్రటరీ జనరల్ రాజేష్ ధల్, మెంబర్ రమేష్ హండా, ట్రెజరర్ నీరజ్ ఠాకూర్, వివేక్ ముఖర్జీ, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రెడ్డి, సెక్రటరీ రమేష్, ఏ. రాజేష్, మీడియా అకాడమీ మేనేజర్ శైలేశ్వర్ రెడ్డి, ఓ.ఎస్.డి. ఎమ్.కె. రహమాన్, తదితరులు పాల్గొన్నారు.
