నందిని సిధారెడ్డిని ఘనంగా సన్మానించిన ‘టాక్’ ప్రతినిధులు

  • సిధారెడ్డికి ప్రతిష్ఠాత్మక సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం పట్ల టాక్ హర్షం
  • కరోనా కాలంలో రాసిన ‘అనిమేష’కు పురస్కారం
  • సాహిత్య అకాడమీ పురస్కారంతో తెలంగాణ సాహిత్య ప్రతిష్ఠ మరింత ఇనుమడింపు
  • సాహిత్య అకాడమీ పురస్కారం దక్కడం తెలంగాణ సాహిత్యానికి గర్వకారణం
  • తెలంగాణ సాహిత్య వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్న సిధారెడ్డికి టాక్ అభినందనలు
  • తెలంగాణ సంస్కృతి, సాహిత్య పరిరక్షణకు ‘టాక్’ చేస్తున్న సేవలు అభినందనీయం: నందిని సిధారెడ్డి

హైదరాబాద్, వెలుతురు, ఆగష్టు 29:

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి ఛైర్మన్, ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డిని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ప్రతినిధులు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఆయన రచించిన ‘అనిమేష’ వచన కవితా సంపుటికి 2025 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నందిని సిధారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ‘టాక్’ సంస్థను అభినందించారు. లండన్‌లో టాక్ ఆవిర్భావ కార్యక్రమానికి హాజరైన నాటి నుంచి సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలను నిశితంగా గమనిస్తున్నానని తెలిపారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు సమాజ సేవను లక్ష్యంగా చేసుకుని గత తొమ్మిదేళ్లుగా టాక్ సంస్థ ముందుకు సాగుతున్న తీరు అభినందనీయమని అన్నారు. ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా సంస్థ తన లక్ష్యాలను కొనసాగిస్తూ స్థిరంగా ముందుకు సాగడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

సంస్థను ఏర్పాటు చేయడం మాత్రమే గొప్ప విషయం కాదని, దానిని దీర్ఘకాలం కొనసాగిస్తూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడమే నిజమైన నాయకత్వానికి నిదర్శనమని నందిని సిధారెడ్డి అన్నారు. టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, మాజీ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి, ప్రస్తుత అధ్యక్షుడు రత్నాకర్ కడుదులతో పాటు కార్యవర్గ సభ్యుల కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా నందిని సిధారెడ్డి తాను రచించిన, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న అనిమేష కవితా సంపుటితో పాటు తన ఇతర పుస్తకాలను టాక్ ప్రతినిధులకు బహూకరించారు. టాక్ సంస్థకు చీఫ్ అడ్వైజర్లుగా నందిని సిధారెడ్డి, కట్టా శేఖర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.

తెలంగాణకు గర్వకారణం: అనిల్ కూర్మాచలం

టాక్ వ్యవస్థాపకుడు, తెలంగాణ ఎఫ్‌డిసి మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో తన పాట, సాహిత్యం ద్వారా ప్రజలను ఆలోచింపజేస్తూ, ఉద్యమ కవిగా ప్రజల అభిమానాన్ని సిధారెడ్డి చూరగొన్నారని, ఆయన తన రచనల ద్వారా తెలంగాణ సాహిత్యానికే వన్నె తెచ్చారని కొనియాడారు. నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం యావత్ తెలంగాణకు గర్వకారణమన్నారు. తమకు గురువులా మార్గనిర్దేశం చేస్తూ, ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తున్న నందిని సిధారెడ్డికి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం రావడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.

టాక్ ప్రతినిధులతో కలిసి నందిని సిధారెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమపై నందిని సిధారెడ్డికి ఉన్న ప్రేమాభిమానాలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ కొనసాగాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకోవడంతో పాటు సాహిత్య రంగానికి మరింత సేవ చేయాలని కోరుకున్నారు.

టాక్ కమ్యూనిటీ అఫైర్స్ ఛైర్‌పర్సన్ గణేష్ కుప్పాల, అడ్వైజరీ బోర్డు సభ్యురాలు జాహ్నవి దూసరి మాట్లాడుతూ నందిని సిధారెడ్డి భవిష్యత్తులోనూ టాక్ సంస్థకు విలువైన సలహాలు, సూచనలు అందిస్తూ సంస్థను మరింత ముందుకు నడిపించాలని కోరారు. తమకు విలువైన సమయం కేటాయించి ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన తెలంగాణ సాహిత్య రంగానికి  చేసిన  సేవలకు, సుదీర్ఘ సాహిత్య కృషికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న సందర్బంగా  శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టాక్ సభ్యురాలు నవ్య కుప్పాల, తిరుమందాస్ నరేష్ గౌడ్, జర్నలిస్ట్ బత్తిని వినయ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.