కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలనపై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు

  • తాండూర్ సభలో రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపాటు
  • వచ్చే ఎన్నికల్లో మూడు నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా

తాండూరు, వెలుతురు, ఆగష్టు 30:

వికారాబాద్ జిల్లా తాండూర్‌లో నిర్వహించిన బీజేపీ సభలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలనపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కార్యకర్తలు ఐకమత్యంతో ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు.

ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ ఎదిగిందని పేర్కొన్న కిషన్ రెడ్డి.. వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా రమేశ్ నియమితులైన సందర్భంగా ఆయన నాయకత్వంలో పార్టీని మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

తాండూర్ ప్రాంతంలో గతంలో బీజేపీకి లభించిన ప్రజా మద్దతును గుర్తుచేసిన ఆయన, టైగర్ నరేంద్ర, బద్దం బాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితర నాయకుల కాలంలో పార్టీ సాధించిన మెజారిటీలను ప్రస్తావించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

1980 జూలైలో బీజేపీ ఆవిర్భావ సమయంలో సర్వేశ్వర్ రెడ్డి, బద్దం బాల్ రెడ్డిలతో కలిసి తాను తొలి బీజేపీ జెండాను చేపట్టిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. మజ్లిస్ పార్టీతో పోరాడి విజయం సాధించిన చరిత్ర తాండూర్ ప్రాంతానికి ఉందని పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్ హయాంలో కుటుంబ దోపిడీ.. కాంగ్రెస్ పాలనలో కమీషన్ల దందా

తెలంగాణలో పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కుటుంబ దోపిడీ కొనసాగిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ‘కమీషన్ల ప్రభుత్వంగా’ మార్చిందని విమర్శించారు. రియల్ ఎస్టేట్, కాంట్రాక్టులు, భవన నిర్మాణాల విషయంలో కమీషన్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని, మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేడు సుమారు రూ.13 లక్షల కోట్ల అప్పుల్లో చిక్కుకుందని ఆయన పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ప్రయోజనాలు అందించలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనల కారణంగానే రాష్ట్రం ఈ దుస్థితికి చేరిందని విమర్శించారు.

మోదీ పాలనపై ప్రశంసలు

ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయడం, అయోధ్యలో రామమందిర నిర్మాణం, ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ, పేదలకు ఉచిత బియ్యం, రైతులకు సబ్సిడీలు వంటి పలు కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు.

దేశంలో తొలిసారిగా బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, అవినీతి రహిత పాలన అందించడం కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారిందని వ్యాఖ్యానించారు. ఈ అంశాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆయన ప్రశ్నించారు.

బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలనలను ప్రజలు గమనించారని, తెలంగాణలో బీజేపీకి ఒక్కసారి సుపరిపాలన అందించే అవకాశం ఇవ్వాలని కిషన్ రెడ్డి కోరారు. పార్టీ కార్యకర్తలు ఆత్మవిశ్వాసంతో, ఐకమత్యంగా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలపై పోరాడాలని సూచించారు. తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేసేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.