హైదరాబాద్, వెలుతురు: అక్టోబర్ 07
రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న ఓ కుటుంబానికి అండగా నిలిచి, అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి వైద్య చికిత్స అందించేందుకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పనిగిరి గ్రామ నివాసులు జంపాల మహేష్ కుమార్, రజిత దంపతులు ఇద్దరూ మూగ, చెవిటి వారు. వారికి జన్మించిన బిడ్డ కూడా మూగ, చెవిటి తనంతో పుట్టడంతో ఆ తల్లిదండ్రుల జీవితాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తమ బిడ్డకు సరైన వైద్యం అందిస్తే మాట్లాడే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో ఆ కుటుంబంలో కొంత ఆశ చిగురించింది. అయితే, ఇందుకు లక్షల్లో ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ దంపతులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గారిని ఆశ్రయించారు. వారి పరిస్థితిని తెలుసుకున్న మంత్రి ఎంతో ఆప్యాయతతో స్పందించారు. చిన్నారిని స్వయంగా ఎత్తుకుని అక్కున చేర్చుకుని, తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. చిన్నారి వైద్య చికిత్స కోసం రూ.2 లక్షల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించారు. అంతేకాకుండా, చిన్నారికి మెరుగైన వైద్యం అందించే విషయంలో వైద్యులతో స్వయంగా మాట్లాడుతానని మంత్రి హామీ ఇచ్చారు. “మీ బిడ్డ విషయంలో ఆందోళన చెందవద్దు. ఏ సహాయం కావాలన్నా నేను అండగా ఉంటాను” అంటూ ఆ దంపతులకు భరోసా కల్పించారు.
