ఆసియా చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలపై తెలుగు వికీపీడియాలో ప్రత్యేక ఎడిటతాన్

శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయంలో వికీపీడియా ఏషియన్ నెల 2026 కార్యశాల.. వ్యాస రచనపై శిక్షణ, టీమ్ ఛాలెంజ్‌లు

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 22:

ఆసియా ఖండంలోని వివిధ దేశాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం, ప్రముఖ వ్యక్తులు, విశేషాలను తెలుగు భాషలో అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో తెలుగు వికీపీడియాలో ‘వికీపీడియా ఏషియన్ నెల 2026’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నవంబర్ 1 నుంచి 30 వరకు నెల రోజుల పాటు కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ సుల్తాన్ బజార్‌లోని శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయంలో ఎడిటతాన్, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు.

ఆసియా వైవిధ్యాన్ని తెలుగు పాఠకులకు చేరువ చేయడమే లక్ష్యం

ఆసియా దేశాల చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, సంప్రదాయాలు, ప్రముఖ వ్యక్తులు, సామాజిక విశేషాలను తెలుగు పాఠకులకు పరిచయం చేయడంతో పాటు, స్థానిక భాషల్లో విజ్ఞాన విస్తరణకు ప్రోత్సాహం కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. వికీపీడియా రచయితల మధ్య సహకారాన్ని పెంపొందిస్తూ, ఆసియా అంశాలపై తెలుగు వికీపీడియాలో నాణ్యమైన సమాచారాన్ని విస్తరించేందుకు ఎడిటతాన్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కనీసం నాలుగు వ్యాసాలు రాసిన వారికి ప్రత్యేక వికీపీడియా పోస్టుకార్డులను అందించడంతో పాటు, అత్యధిక సంఖ్యలో నాణ్యమైన వ్యాసాలు రూపొందించిన రచయితకు ‘వికీపీడియా ఏషియన్ అంబాసడర్’ బిరుదును ప్రదానం చేయనున్నారు.

వికీపీడియా రచన, ఎడిటింగ్‌పై శిక్షణ

శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయంలో నిర్వహించిన ఎడిటతాన్‌లో పాల్గొన్న వారికి వికీపీడియాలో వ్యాసాల రచన, ఎడిటింగ్, సమాచారాన్ని జోడించడం, వ్యాసాల నాణ్యతను మెరుగుపరచడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఆసియా దేశాలకు సంబంధించిన అంశాలపై కొత్త వ్యాసాలు రూపొందించడంతో పాటు, ఇప్పటికే ఉన్న వ్యాసాలను విస్తరించేలా పాల్గొనేవారిని ప్రోత్సహించారు.

స్థానిక భాషల్లో డిజిటల్ విజ్ఞాన విస్తరణపై చర్చ

వివిధ భాషా వికీపీడియా కార్యక్రమాల్లో అనుభవం ఉన్న వికీపీడియన్లు తమ అనుభవాలను, సూచనలను పంచుకున్నారు. బోలి చేతో సంస్థ వ్యవస్థాపకులు నేతి సాయికిరణ్ వీడియో సందేశం ద్వారా వికీపీడియన్లకు శుభాకాంక్షలు తెలిపారు. గోండి, కోలాం భాషల్లో వికీపీడియా అభివృద్ధి, స్థానిక భాషల్లో డిజిటల్ విజ్ఞాన విస్తరణపై ఆత్రం మోతిరామ్, కిరణ్ వివరించారు. వికీపీడియా శిక్షణ, నిర్వహణ, వికీపీడియా సముదాయంలో తన అనుభవాలను సీనియర్ వికీపీడియన్ కశ్యప్ పంచుకున్నారు. తక్కువ సమయంలో సమర్థంగా నాణ్యమైన వ్యాసాలను రూపొందించే విధానాలు, వ్యాస రచనలో పాటించాల్సిన ప్రమాణాలపై బత్తిని వినయ్ కుమార్ గౌడ్ శిక్షణ ఇచ్చారు.

గేమ్స్, టీమ్ ఛాలెంజ్‌లతో ఆసక్తికరంగా ఎడిటింగ్

శిక్షణతో పాటు వికీపీడియా ఆధారిత గేమ్స్, టీమ్ కార్యకలాపాలు, వ్యాస రచన పోటీలు, పరస్పర వ్యాసాల సమీక్షలు నిర్వహించారు. పాల్గొనేవారిని బృందాలుగా విభజించి ఆసియా అంశాలపై వ్యాసాలు రూపొందించడం, ఇప్పటికే ఉన్న వ్యాసాలను విస్తరించడం, నమ్మదగిన మూలాలను జోడించడం, అంతర్గత లింకులు, వర్గీకరణలను మెరుగుపరచడం వంటి కార్యకలాపాల్లో భాగస్వాములను చేశారు. ఆటలు, టీమ్ ఛాలెంజ్‌ల ద్వారా వికీపీడియా రచన, ఎడిటింగ్‌ను మరింత ఆసక్తికరంగా పరిచయం చేశారు.

స్వేచ్ఛా విజ్ఞాన విస్తరణకు కొత్త వికీపీడియన్ల ప్రోత్సాహం

తెలుగు వికీపీడియాలో ఆసియా అంశాలకు సంబంధించిన సమాచారాన్ని విస్తరించడంతో పాటు, కొత్త వికీపీడియన్లను ప్రోత్సహించడం, స్వేచ్ఛా విజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఈ కార్యక్రమం ద్వారా లక్ష్యంగా పెట్టుకున్నారు. కార్యక్రమ నిర్వహణలో అంజన్, ప్రవీణ్ పాల్గొనగా, అభిలాష్, కిరణ్ పర్యవేక్షించారు.